భారతీయులు కష్టజీవులు

భారతీయులు కష్టజీవులు
  • దేశాభివృద్ధిలోనూ భాగస్వాములవుతారు
  • ఆస్ట్రేలియాలో దీపావళి వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: భారతీయులు కష్టజీవులని, తాము అభివృద్ధి చెందడంతో పాటుగా తమను ఆదరించిన దేశాభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుతారని అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్  కుమార్  అన్నారు. ఆస్ట్రేలియా తెలంగాణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సిడ్నీలోని  ఉడ్ క్రాఫ్ట్  కమ్యూనిటీ సెంటర్ లో గురువారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్  బండా ప్రకాష్  ముదిరాజ్, లేజిస్లేచర్  సెక్రటరీ డాక్టర్  వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా స్పీకర్  మాట్లాడుతూ కార్యక్రమానికి ఆహ్వానించిన తెలంగాణ కమ్యూనిటీ మిత్రులకు  ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధిలో అన్నదమ్ముల్లా ఉంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని, మనమందరం ఆయనకు అండగా నిలబడాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, యువత కోసం స్కిల్  యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ కోసం యుద్ధం చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రానికి చెడు జరిగిందన్నారు.