అనంతగిరి అర్బన్ ​పార్కుకు శంకుస్థాపన

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​ను పర్యాటకంగా మరింత అభివృద్ధి​ చేసేందుకు ‘అనంతగిరి అర్బన్ పార్క్’ను డెవలప్​ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. శనివారం అనంతగిరి అటవీ ప్రాంతంలో పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ క్వార్టర్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అటవీశాఖ జోనల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్​తో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. 200 ఎకరాల్లో అనంతగిరి అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.