ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు


‘రాజన్న’ ధర్మగుండం ఓపెన్​ చేయండి


వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్​ చేసి పుణ్యస్థానాలకు భక్తులకు అనుమతి ఇవ్వాలని బీజేపీ లీడర్లు కోరారు. ఈ మేరకు శనివారం ఆలయాధికారులకు బీజేపీ లీడర్లు వినతిపత్రం అందజేశారు. భక్తులు పవిత్ర స్నానం ఆచరించే ధర్మ గుండంలో కొవిడ్ టైంలో స్నానాలు బంద్​ చేయించారని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఉన్నందున గుండం తెరిపించాలని డిమాండ్​చేశారు. 10 రోజుల్లో ధర్మగుండం ప్రారంభించాలని లేకపోతే భక్తులతో కలిసి తామే తెరుస్తామన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, లీడర్లు ఎం.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, హరీశ్, నవీన్​, మనోజ్, రాహుల్ పాల్గొన్నారు.

గడ్డం సరోజ బర్త్​డే వేడుకలు


పెద్దపల్లి, వెలుగు:  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి సతీమణి,  విశాఖ ట్రస్టు ఎండీ గడ్డం సరోజ బర్త్​డే వేడుకలు శనివారం పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో  బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో కేక్​ కట్​ చేశారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ పేదలకు నిరంతరం తోడ్పాటునందిస్తూ, విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న, గడ్డం సరోజ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి అభిమానులు మణికంఠ, శ్రీనివాస్ రెడ్డి, దేవి మల్లేశం, తిరుపతి, దేవి, స్వామి, అనిల్, కిశోర్, మహేందర్ పాల్గొన్నారు.

మరిమడ్లలో పోడు రైతుల ఆందోళన
గ్రామసభను బహిష్కరించిన రైతులు

కోనరావుపేట,వెలుగు: తమ సాగు భూములకు హక్కులు కల్పించాలని మరిమడ్లలో దళిత రైతులు శనివారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో పోడు భూముల సర్వేపై శనివారం గ్రామసభ నిర్వహించారు. పోడు సర్వేలో 381మంది దరఖాస్తు చేసుకోగా 29మంది పేర్లు మాత్రమే ఆన్​లైన్​లో వచ్చాయని, మిగతా పేర్లు ఎందుకు రాలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభను బహిష్కరించి దళిత మహిళా రైతులు, గ్రామస్తులు  రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 30ఏండ్లుగా ఫారెస్ట్ భూములలో పంటలు సాగుచేసుకుంటూ జీవిస్తున్నామని, ఫారెస్ట్ అధికారులు మాపై కేసులు నమోదు చేస్తే జైలుకు సైతం వెళ్లామని, ఇప్పుడు తమ పేర్లు ఎందుకు నమోదు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం పోడు భూముల సమస్యల పరిష్కారానికి జీవో140 జారీ చేసి అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పొందే అవకాశం కల్పించినా కింది స్థాయి సిబ్బంది తూతూమంత్రంగా సర్వే చేయడంతో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలు నిలిచాయి. ఎంపీడీఓ రామకృష్ణ మళ్లీ సర్వే  చేయించేందుకు ఉన్నతాధికారులకు  నివేదిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు నరేశ్, దళిత రైతులు కుమ్మరి దిలీప్, జింక శ్రీనివాస్, కడకుంట్ల రాజనర్సు, రమేశ్​, రాజవ్వ, సక్కుభాయి, కడకుంట్ల విజయ పాల్గొన్నారు.


బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు
మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్,వెలుగు: బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. శనివారం 73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోzaని అంబేద్కర్ విగ్రహానికి మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి  రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించకపోతే ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తెలంగాణలోనూ పునరావృతమవుతాయన్నారు. అందరూ కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకుడు చల్లహరిశంకర్, మేడి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్31లోగా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి....

కరీంనగర్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జితో పాటు మానేర్ రివర్ ఫ్రంట్ పనులు శనివారం టూరిజం శాఖ ఎండీ, ఇరిగేషన్ శాఖ ఈఎన్​సీ, ఎస్ఆర్ఎస్పీ సీఈ, మేయర్, కలెక్టర్​తో కలిసి మంత్రి గంగుల పరిశీలించారు.  డిసెంబర్31లోగా కేబుల్​బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని  చెప్పారు. కరీంనగర్ ను టూరిజం స్పాట్​గా మార్చేందుకు మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామన్నారు.