నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. డబుల్ బెడ్ రూం అని చెప్పి నిరుపేదలను కూడా మోసం చేశారని విమర్శించారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, భూదందా, ఇసుక దందాలు నడిచాయని చెప్పారు. రైతులను నిండా ముంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవాపూర్, కాటారం మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తుందని చెప్పారు గడ్డం వంశీకృష్ణ. మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో వంద రోజుల్లో 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇవ్వన్ని ప్రజలు గమనించాలని.. సేవ చేసే వారికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాక నీడలో పెరిగిన తాను ఆయన సేవలు గుర్తుకు చేసే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కల్పిస్తానన్నారు. మీ చిన్న కొడుకులా భావించి తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు.