- రాజకీయంగా ఆయనకు మంచి భవిష్యత్ ఉంది
- కాకా కుటుంబం ప్రజాసేవలో ముందుంటుంది
- మేం మంచి పనులు మాత్రమే చేస్తం.. చెడును ఉపేక్షించమని వార్నింగ్
- చెన్నూరులో ఘనంగా వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ, సన్మాన సభ
కోల్‌బెల్ట్/మంచిర్యాల/గోదావరిఖని/సుల్తానాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశంసించారు. కాకా కుటుంబం ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటుందని, అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంపీ వంశీకృష్ణకు రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందన్నారు. మున్ముందు వంశీ పెద్ద లీడర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. -పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎంపీ వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ, సన్మాన సభకు శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన సన్మాన సభలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. పెద్దపల్లి ఎంపీగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడిచేందుకు ఆయన మనవడు వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలంగాణ కోసం కొట్లాడారన్నారు. చెన్నూరు, మంథనికి అవినాభావ సంబంధం ఉందని, తాను వివేక్ కలిసి ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ మంథని-–శివారం మధ్య గోదావరి నదిపై రూ.120 కోట్లతో బ్రిడ్జిని నిర్మించనున్నామని తెలిపారు. ఎన్‌హెచ్– 63 లో ఉన్న ఇబ్బందులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో మాట్లాడి రూ.100 కోట్ల నిధులు తీసుకువచ్చిన ఘనత వివేక్ కు దక్కిందని చెప్పారు. ఆయన హైదరాబాద్ పోయినా.. ఢిల్లీకి పోయినా ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఆరాటపడే వ్యక్తి అని అభినందించారు. చెన్నూర్ రైతులకు సాగునీరు అందించడానికి వివేక్ కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతులందరికీ త్వరలో రుణమాఫీ
రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ కు సరిపడా కరెంటు సప్లై చేస్తున్నామని చెప్పారు. కరెంట్ ఉండడం లేదంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ మంచి పనులే చేస్తుందని, అలాగే.. చెడును ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఐదు నెలల్లోనే 100 బోర్లు వేయించాం: ఎమ్మెల్యే వివేక్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో వేలకోట్ల రూపాయలు దోచుకుందని, గత పదేండ్లలో నియోజకవర్గ ప్రజలకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో 100 బోర్లు వేయించి, నీటి సమస్యలు తీర్చానని చెప్పారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్‌తో చెన్నూరును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా ఫారెస్ట్ సమస్యలు ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ వంశీకృష్ణ, తాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి విన్నవించామని తెలిపారు. ఎన్‌హెచ్63లో ఇంకా 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేసేది ఉందని, రూ.100 కోట్ల ఫండ్స్ మంజూరు చేయించానని చెప్పారు. కొన్ని యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని కోరారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గతంలో బాల్క సుమన్, వెంకటేశ్ నేత చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్నపుడు రామగుండం, క్యాతన్ పల్లిలో రైల్వే బ్రిడ్జి లు సాంక్షన్ చేయించానని చెప్పారు. పదేండ్లు దాటినా గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో క్యాతనపల్లి బ్రిడ్జి పూర్తి కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని పార్టీ శ్రేణులు, కాకా అభిమానులు ఘనంగా సన్మానించారు. ఆత్మీయ సమ్మేళన సభలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, బి.వెంకట్రావ్, సింగరేణి జేఏసీ కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ: విజయ రమణారావు, రాజ్‌ఠాకూర్
పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన యువనేత వంశీకృష్ణ, రాహుల్ గాంధీ సారథ్యంలో పనిచేయడం గొప్ప అదృష్టమని ఎమ్మెల్యేలు విజయ రమణారావు, ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి వంశీకృష్ణ తో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రామగుండం మేయర్ బంగి అనిల్‌కుమార్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి, కార్పొరేటర్లు బొంతల రాజేశ్, అడ్డాల స్వరూప, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
వంశీకి ఘన స్వాగతం
ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చెన్నూర్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న వంశీకృష్ణకు మార్గమధ్యలో ఘనస్వాగతం లభించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, బసంత్‌నగర్ కన్నాలలో తొగరి తిరుపతి, కుందనపల్లిలో జీన్స్ శ్రీనివాస్, రామగుండం, గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పి.మల్లికార్జున్తదితరులు వంశీని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్, గోదావరిఖనిలో కేంద్ర మాజీ మంత్రి, కాకా వెంకటస్వామి విగ్రహానికి వంశీకృష్ణ పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని, అందుకే పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సింగరేణి కార్మికుడి డ్రెస్‌లో వెళ్లానని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉన్న సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని, వేలంలో పెట్టకుండా తెలంగాణలో ఉన్న కొత్త గనులన్నింటినీ సింగరేణికే కేటాయించాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశానని చెప్పారు.