
- ఇంటికో ఉద్యోగం పేరుతో కేసీఆర్ మోసం చేసిండు
- గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివద్ధి చేస్తా
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కేసీఆర్మోసం చేశాడని కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి పాల్గొన్నారు. మందమర్రి మండలం వెంకటపూర్, గుడిపెల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారని, బంగారు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు. పెద్దపల్లి ఎంపీగా తాను గెలిస్తే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను సొంతంగా సోలార్ బైక్ కంపెనీ ఏర్పాటు చేసి 500 మంది యువతకు ఉద్యోగాలు కల్పించానని, అందులో సింగరేణి కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు, బెల్లంపల్లిలో మామిడి మార్కెట్, పల్లెపల్లెకూ రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా సేవ చేశాం..
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కృషితోనే జైపూర్‌లో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వంశీకృష్ణ తెలిపారు. కాకా వెంకటస్వామి, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు వినోద్, వివేక్‌వెంకటస్వామి ఈ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపించారని గుర్తు చేశారు. కాకా చూపిన బాటలో సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయిన విశాక ట్రస్టు, కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధి, గ్రామాల్లో మంచి నీటి బోర్లు వేశామన్నారు. ఆదరించి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నెన్నెల కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు మల్లేశ్, గొల్లపల్లి, గుండ్ల సోమారం ఎంపీటీసీలు హరీశ్ గౌడ్, దాగం రమేశ్, లీడర్లు తోట శ్రీనివాస్, చీర్ల కిషన్‌రెడ్డి, తారాచంద్, మల్లిక, గట్టు బానేశ్, దుర్గం రవి తదితరులు పాల్గొన్నారు.
వివేక్ సమక్షంలో చేరికలు
మందమర్రి మున్సిపాలిటీ 18 వార్డు గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి జావిద్ ఖాన్ నేతృత్వంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ సల్వోజి ప్రభాకర్ రావు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ఉపేందర్గౌడ్, నాయకులు సోత్కు సుదర్శన్, గుడ్ల రమేశ్, బత్తుల రమేశ్, బూడిద శంకర్, మైనార్టీ లీడర్ ఇషాక్, మహిళా విభాగం టౌన్ ప్రెసిడెంట్ గడ్డం రజని తదితరులు పాల్గొన్నారు.
వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి
అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ లీడర్లు కోరారు. కాసీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంతో పాటు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. కులమతాలను రెచ్చగొట్టి ఓట్లు పొందడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి దాగం మల్లేశ్, జిల్లా సమితి సభ్యులు సత్యం, బిల్డింగ్వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాడి పోశం, గట్టు సర్వేశం, శంకర్, గట్టయ్య, రాజలింగు, పోశం తదితరులు పాల్గొన్నారు.