- కాకాకు పెద్దపల్లితో విడదీయలేని బంధముందని వెల్లడి
సుల్తానాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నేత గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సుల్తానాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) విగ్రహానికి గురువారం ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 30 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి
సంక్షేమానికి మారుపేరని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో మరింత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సింగరేణిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పించడమే సీఎం లక్ష్యమన్నారు. ఆరు గ్యారంటీ పథకాల ద్వారా అర్హులైన వారికి పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు, తదితర సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. గతంలోనూ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాకా హయాంలో జరిగాయని గుర్తుచేశారు.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంతో కాకాకు ఉన్న అనుబంధం విడదీయ లేనిదని చెప్పారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకులు సజ్జత్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పార్టీ లీడర్లు అబ్బయ్య గౌడ్, కిషోర్, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, నీరటి శంకర్, ధరడే శ్యామ్, పన్నాల రాములు, రాజలింగం, కౌన్సిలర్ రాజయ్య, రఫీక్, రాజు, నన్ను
శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్ రౌతు రవి ఇటీవల మరణించగా, బాధిత కుటుంబాన్ని వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.