సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

సింగరేణి కార్మికుల సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర చాలా గొప్పదన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మే 11వ తేదీ శనివారం ఉదయం రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 2వ బొగ్గు గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వంశీకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల యూనిఫాంలో కార్మికులను కలవడం సంతోషంగా ఉందన్నారు. రామగుండం అంటే కాకా వెంకటస్వామికి చాలా చాలా దగ్గర అనుబంధని చెప్పారు. సంస్థ బాగుంటే రాష్ట్రం బాగుంటుందని.. రాష్ట్రం బాగుంటే దేశం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు.  గత 10 ఏళ్లు ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్మిక వర్గానికి చేసిందేమీ లేదని కార్మికులు చెపుతున్నారన్నారు.  సింగరేణి సంస్థలు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ కు కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తుందని వంశీ చెప్పారు. సొంత కర్మాగారాన్ని ఏర్పాటు చేసి 500 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని తెలిపారు. అందులో సింగరేణి కార్మికుల పిల్లలు ఎక్కువశాతం మంది పని చేస్తున్నారని చెప్పారు. ఎంపీగా గెలిపిస్తే కార్మిక సమస్యలను పరిష్కారిస్తానని .. సురక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.  సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు.  పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
మీ ఇంట్లో చిన్న కొడుకు లాగా ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గెలిపించండని వంశీకృష్ణ కోరారు.