- సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి : గడ్డం వంశీకృష్ణ
- సింగరేణిలో కొత్త కోల్మైన్స్ తీసుకొస్తామని హామీ
కోల్బెల్ట్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులను అరిగోస పెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు కార్మికుల సంపాదనను కూడా దోచుకున్నదని ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసీపేట–1 సింగరేణి బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడ్డం వంశీ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామికి సింగరేణి కార్మికులంటే ఎనలేని ప్రేమ ఉండేదని చెప్పారు. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్కారు నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.20 వేల కోట్ల విద్యుత్తు, బొగ్గు బకాయిలను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం కృషి చేస్తానని చెప్పారు.
రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ యత్నం: ఎమ్మెల్యే వినోద్
బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసేం దుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆరోపించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. గేట్ మీటింగ్ అనంతరం వంశీకృష్ణ, వినోద్ వెంకటస్వామి కాసీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లెంగూడ గుట్ట ప్రాంతంలో ఉన్న కూలీల వద్దకు వంశీకృష్ణ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు.
ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాసీపేట–1 మైన్పై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, సెక్రటరీ ఎండీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, పిట్సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ, ఐఎన్టీయూసీ లీడర్లు సమ్మయ్య, భూమయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.