గోదావరిఖని, వెలుగు: తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తీసుకువచ్చి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11వ గని ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాయి బాట' కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, మేయర్ అనిల్‌కుమార్‌తో కలిసి వంశీకృష్ణ పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిలో కొత్త బొగ్గు గనులను ప్రారంభించలేదని విమర్శించారు. చదువుకున్న వ్యక్తిగా, పరిశ్రమలను స్థాపించిన వాడిగా కాంగ్రెస్ హయాంలో తప్పకుండా సింగరేణిలో కొత్త గనులను తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం, వారి సొంతింటి కలను నిజం చేసేందుకు పోరాడుతానని తెలిపారు. కార్మికులు నష్టపోకూడదని దివంగత కాకా వెంకటస్వామి లేబర్ యూనియన్లను ప్రారంభించారని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కార్మికులంటే కాకాకు అమితమైన ప్రేమ ఉండేదన్నారు. డబ్బు సంపాదించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, సేవ చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు.
రూ.1300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ.1300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక నిర్మాణ పనులను ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ కార్మికులకు అండగా ఉంటుందని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న, సేవ చేసే గుణం ఉన్న యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. అంతకుముందు కల్యాణ్‌నగర్‌లోని ఉల్లిగడ్డల బజార్లో గల విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం గాయత్రీ బంకెట్ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విశ్వబ్రాహ్మణులు కాంగ్రెస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో లీడర్లు కె.సదానందం, పి.ధర్మపురి, వికాస్ కుమార్, వడ్డేపల్లి దాస్, కాల్వ లింగస్వామి, రాజేశ్, స్వామి, ముస్తఫా, శ్రీనివాస్, ప్రకాశ్, ఎల్లయ్య, రమేశ్, సంపత్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెన్నోజు నారాయణ, బి.శ్రీనివాస్, రాధాకృష్ణ, కృష్ణమాచారి, కస్తూరి కుమార్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.