- బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా ప్రైవేటైజేషన్
- కొత్త బొగ్గు గనులతో యువతకు ఉపాధి కల్పిస్త
- కార్మికులకు అండగా ఉంటూ సొంతింటి కలను నెరవేర్చుతం
- శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే7 మైన్ గేట్ మీటింగ్‌లో ప్రచారం
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్‌దేనని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త బొగ్గు గనిని కూడా తవ్వించలేదని పెద్దపల్లి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 కోల్ మైన్, ఏరియా వర్క్‌షాప్, స్టోర్స్ పై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్మీటింగుల్లో ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్వహించేందుకు కేంద్రం లోని బీజేపీ సర్కార్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే అప్పటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎంపీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని, సింగరేణిలో వేలానికి వ్యతిరేకంగా పోరాటల పేరుతో దొంగ నిరసనలు చేశారని విమర్శించారు. కొత్త బొగ్గు గనుల కోసం కేసీఆర్ కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, సింగరేణిలో ప్రైవేటైజేషన్ జరుగుతుంటే అడ్డుకోకుండా సహకరించాడన్నారు. సీపీఐ, ఏఐటీయూసీల మద్దతు తమకు కలిసివస్తుందన్నారు.
సింగరేణి సంస్థ నష్టాల బాటలో ఉంటే రూ.450 కోట్ల రుణం ఇప్పించి కంపెనీతో పాటు లక్ష ఉద్యోగాలను కాపాడిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కిందన్నారు. సింగరేణి కార్మికవర్గం కాకా కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. పెద్దపల్లి ఎంపీగా ఆదరిస్తే సింగరేణికి సర్కార్ నుంచి రావాల్సిన రూ.30వేల కోట్లను ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త బొగ్గు బావులు తీసుకువస్తానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు, సొంతింటి కల నెరవేర్చుతానని పేర్కొన్నారు.
కార్మికులకు కోటి రూపాయల యాక్సిడెంట్ ఇన్సురెన్స్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. సోలార్ రూఫ్ ప్రొడక్ట్ కనిపెట్టితే అమెరికా ప్రభుత్వం తనకు అవార్డు ఇచ్చిందని చెప్పారు. కష్టపడితే ఎదైనా సాధించొచ్చు అని నేర్పిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని ఆయన స్ఫూర్తితోనే పెద్దపల్లి పార్లమెంట్ లో ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు అక్రమ దందాలు,భూకబ్జాలు, ఇసుక దందాలు చేస్తూ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు.
ప్రైవేటైజేషన్ రద్దు కాంగ్రెస్‌తో సాధ్యం: వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ చట్టం తెచ్చిందని, దాన్ని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. కార్మికవర్గం, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో తమ యూనియన్, పార్టీ, కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. కార్మికులకు చట్టాలు ఉంటేనే న్యాయం జరుగుతుందని, వాటిని రద్దు చేసిన బీజేపీని కార్మికవర్గం ఓడించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తే పార్లమెంటులో సింగరేణి గొంతుకై సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీ నేతలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, షేక్ బాజీ సైదా, కొట్టే కిషన్ రావు, సంపత్, రాచర్ల చంద్రమోహన్, మారపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు.