వంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం: వివేక్ వెంకటస్వామి

  • దళితుల ఐక్యతే కాకా కోరిక
  • మందమర్రిలో లెదర్ పార్కును రీఓపెన్ చేయిస్తం 
  • దళితులను బీజేపీ, బీఆర్ఎస్ పట్టించుకోలే
  • గడ్డం వంశీకృష్ణకు ఎమ్మార్పీఎస్, యాదవ సంఘం మద్దతు  

కోల్ బెల్ట్/పెద్దపల్లి, వెలుగు: కాకా కుటుంబం ఎప్పుడూ దళితుల అభ్యున్నతినే కోరుకుంటుందని.. మాల, మాదిగలు, ఎస్సీ ఉపకులాలు ఐక్యంగా ఉండాలని కాకా తపించేవారని చెన్నూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాలలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో వంశీకృష్ణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఎమ్మార్పీఎస్, యాదవ కులసంఘం నేతలు తీర్మానం చేశారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని నాయకులు ప్రకటించారు. 

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వంశీకృష్ణకు మంచి స్పందన వస్తోందని, అన్ని కుల సంఘాలను కలుపుకుని వెళ్తున్నామని చెప్పారు. వంశీని ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మందమర్రిలో లెదర్ పార్క్ కు నిధులు తెచ్చి రీఓపెన్ చేయిస్తామని హామీ ఇచ్చారు.

 మాదిగల కోసం జగ్జీవన్ భవన్ లు కట్టిస్తామన్నారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏనాడూ దళితులను పట్టించుకోలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ సర్కార్ అంటోంది. రాజ్యాంగాన్ని మారిస్తే ఎస్సీ, ఎస్టీలు తమ హక్కులు, రిజర్వేషన్లు కోల్పోతారు” అని వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే మంద కృష్ణ మాదిగ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న ఆయన మాదిగలకు ఎంపీ టికెట్లు ఎందుకు ఇప్పించుకోలేదని ప్రశ్నించారు. 

సింగరేణిని కాకా కాపాడారు.. 

ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బాల్క సుమన్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, కాకా కుటుంబం చేసిన సేవలపై అవగాహన లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని వివేక్ మండిపడ్డారు. బాల్క సుమన్ బుర్ర కరాబ్ అయినట్టుందని ఎద్దేవా చేశారు. ‘‘సింగరేణి సంస్థ నష్టాల బారిన పడి సిక్ ఇండస్ట్రీస్ జాబితాలోకి వెళ్తే.. కాకా వెంకటస్వామి రూ. 450 కోట్ల రుణం ఇప్పించి సంస్థను, లక్ష మంది కార్మికులను కాపాడారు. 

జైపూర్ లో 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కూడా ఆయన ఘనతే. నేను ఎంపీగా ఉన్నప్పుడు రూ. 10 వేల కోట్ల రుణం మాఫీ చేయించి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించా. హైదరాబాద్–బెల్లంపల్లి ఇంటర్ సీటీ ఎక్స్​ప్రెస్ రైలును కూడా నేనే మంజూరు చేయించాను. మందమర్రి, రవీంద్రఖని, ఓదెలు, మంచిర్యాల రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్​ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కూడా ఇప్పించాను” అని వివేక్ తమ కుటుంబం చేసిన సేవలను గుర్తు చేశారు.

అవినీతి నిరూపిస్తే పాలిటిక్స్ వదిలేస్త..  

కల్వకుంట్ల కవిత ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, అది కుటుంబ పాలన కాదా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను వివేక్ ప్రశ్నించారు. తాము ఎల్లప్పుడూ నేరుగా ఎన్నికల్లో పోటీ చేశామని, దొడ్డి దారిన పదవులు పొందలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొప్పుల ఈశ్వర్ ఎన్నడూ కేసీఆర్ ముందు కనీసం కూర్చోలేదని, దళితులను పట్టించుకోలేదన్నారు. నేతకాని సమాజం నుంచి ఎంపీ అయిన బోర్లకుంట వెంకటేశ్ వాళ్ళ కులానికి సైతం ఏమీ చేయలేదన్నారు. తమను తిడితే తమకే ఓట్లే పెరుగుతాయని.. కాకాను విమర్శిస్తే వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తాడన్నారు. 

నేను నిజంగా దోపిడీ చేసి ఉంటే.. ఈడీ నాపై చర్యలు తీసుకునేది. మా సంస్థల్లో రూపాయి అవినీతి ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించిన ఘనత మా సంస్థలకు ఉంది. మేం ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోలేదు. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రజలకు సేవ చేస్తున్నాం. మా కుటుంబం అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా”అని వివేక్ సవాల్ విసిరారు. సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండి సదానందం యాదవ్, జనరల్ సెక్రటరీ మల్లెత్తుల నరేష్ యాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు కొంకటి రవీందర్, పెద్దపల్లి, ధర్మపురి, చెన్నూరు, రామగుండం, మంథని నియోజకవర్గాల లీడర్లు పాల్గొన్నారు.

పరిశ్రమలు తెచ్చి.. ఉద్యోగాలు కల్పిస్త: గడ్డం వంశీకృష్ణ  

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ఆ పార్టీ దళితుల ద్రోహి అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బ్రిటిష్​పాలన తరహాలో విభజించు, పాలించు అన్నట్టుగా దళితుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఫైర్ అయ్యారు. ఎమ్మార్పీఎస్, యాదవ కులసంఘం నేతలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. కాకా వెంకటస్వామి బాటలో ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ ఉపకులాల కోసం పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్​తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. 

మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్స్ లోనూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగ సమస్య నిర్మూలనే నా మెయిన్ ఎజెండా. ఇందుకోసం ప్రభుత్వ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా’’ అని ప్రకటించారు. 

పెద్దపల్లి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి పత్తిపాక రిజర్వాయర్ కట్టించే బాధ్యత తీసుకుంటానన్నారు.  కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల స్కాం చేసిన గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందన్నారు. పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి పెన్షన్ స్కీం తెచ్చారన్నారు. పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపించాలని, ఇంట్లో చిన్న కొడుకుగా భావించి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.    

పత్తిపాక రిజర్వాయర్ కట్టిస్తాం: విజయరమణారావు 

ఎన్ని కోట్లు ఖర్చయినా మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పత్తిపాక రిజర్వాయర్ కట్టి కాల్వ శ్రీరాంపూర్ పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రానున్న రోజుల్లో ఎకరం పొలం కూడా ఎండకుండా చూసుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల చివరి తడికి నీరు అందించామన్నారు. కాకా వెంకటస్వామి మనవడు, డాక్టర్ వివేక్​ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ ప్రజాసేవ చేయడానికి వచ్చారని, ఆయనను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల కాంగ్రెస్​లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.