దోచుకున్నోళ్లను తరిమికొట్టాలె .. బీఆర్ఎస్​కు గుణపాఠం చెప్పాలె: గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, దోచుకున్నోళ్లను తరిమికొట్టాలని కాంగ్రెస్​నేత వివేక్​వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో దొరల పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లను తరిమిగొట్టేందుకు ఇప్పుడు ఓటుతో జవాబు చెప్పాల్సిన టైమ్ వచ్చింది. సారు.. కారు.. పదహారు.. అన్నారు గుర్తుందా.. ఇప్పుడు సారు.. కారు.. ఇక చాలు.. అనాలి. బీఆర్ఎస్​సర్కార్​యూత్​కు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నది.

 మరి ఈ పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో నిలదీయాలి. చెన్నూర్​లో రాక్షస పాలనను అంతం చేయాలి. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేక్ వెంకటస్వామిని గెలిపించాలి” అని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎంఆర్ఆర్ గార్డెన్స్​లో నిర్వహించిన సమావేశంలో -ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్​పర్సన్​మూల రాజిరెడ్డి సహా చెన్నూరు, కోటపల్లి మండలాల నుంచి 2 వేల మందికి పైగా బీఆర్ఎస్​లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. 

ఈ సమావేశానికి వివేక్​వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేవ చేసేందుకు వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ‘‘మీ అందరినీ చూస్తుంటే మీరు ఆదరించిన మా తాత కాకా వెంకటస్వామి గుర్తుకొస్తున్నారు. పెద్దపల్లి ప్రజలు పర్మిషన్​ఇస్తే మా నాన్న వివేక్​వెంకటస్వామితో కలిసి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాను’’ అన్నారు. చిన్నతనం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూశానని, ఉద్యమం తనలో ఎంతో స్ఫూర్తి నింపిందన్నారు. 

దౌర్జన్యాలు చూడలేకే పార్టీ మారినం: రాజిరెడ్డి  

చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ చూసి తట్టుకోలేకనే అందరం బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరామని మూల రాజిరెడ్డి చెప్పారు. ‘‘నియోజకవర్గంలోని కుందారం, కిష్టాపూర్, శివ్వారం, వేలాల, బీరెల్లి నుంచి ప్రాణహిత పరివాహక ప్రాంతంతో పాటు చెన్నూరు, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని లక్షల ఎకరాల్లో పంట చేన్లు కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో రెండేండ్లు నీట మునిగాయి. 

కానీ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​నేత మునిగిన పంటలను పరిశీలించలేదు. రైతులను పరామర్శించలేదు. ఎమ్మెల్యే బాల్క సుమన్.. రెవెన్యూ, అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్ తో సర్వే చేయించలేదు. సీఎం కేసీఆర్ దత్తపుత్రుడిగా పేరున్న బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు” అని మండిపడ్డారు. 

వేలాది మంది నేతల చేరిక.. 

ఈ సమావేశంలో మూల రాజిరెడ్డి సహా వేలాది మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో మూల సత్యనారాయణ రెడ్డి, గొడిశాల బాపురెడ్డి, చల్లా రాంరెడ్డి, ఎండీ ఫయాజుద్దీన్, చెన్నూరు శ్రీధర్, మైధం రవి కళావతి, అంకాగౌడ్, పోటు రాంరెడ్డి, బాపగౌడ్, బొమ్మ రమాదేవి, బొమ్మ శ్రీనివాస్ రెడ్డి.అసంపెల్లి లక్ష్మీ వెంకటరాజం, పదారి రమేశ్, అసరెల్లి తిరుపతి తదితరులు ఉన్నారు. వీరితో పాటు వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు,  డైరెక్టర్లు సహా దాదాపు రెండు వేల మంది కాంగ్రెస్ లో చేరారు.