
కోల్ బెల్ట్, వెలుగు: తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుంటాయని అనుకున్నామని.. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ ఫైర్అయ్యారు. కేసీఆర్ అవినీతి పాలనతో నిరుద్యోగుల తెలంగాణ చేసిండన్నారు. గురువారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అబ్రహం నగర్లో వివేక్ వెంకటస్వామి తరఫున కాంగ్రెస్-, సీపీఐ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి మాట్లాడారు.
కేసీఆర్ కాళేశ్వరంతో, కేటీఆర్ పేపర్ల లీకేజీతో, కవిత లిక్కర్ స్కాంతో, బాల్క సుమన్ ఇసుక దందాతో లూటీ చేశారని ఆరోపించారు. తెలంగాణ వచ్చి పదేండ్లు దాటినా మన జీవితాలు మారలేదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను, నియోజవకర్గంలో బాల్క సుమన్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ నీళ్ల కోసం వేరే ప్రాంతానికి వెళ్లే దుస్థితి ఉందన్నారు. ప్రజా సేవ చేసేందుకు వచ్చిన వివేక్ వెంకటస్వామిని ఆదరించాలని కోరారు. సమావేశంలో లీడర్లు అబ్దుల్ అజిజ్, ఎండీ అక్బర్, సంగా బుచ్చయ్య, గుండా సత్తయ్య, రాంబాబు, ఇప్పకాయ లింగయ్య, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.