- పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ
గోదావరిఖని, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి, కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ విఠల్‌నగర్‌లో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ కాకా నాలుగు సార్లు పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు.
సింగరేణి అప్పుల్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ.450 కోట్ల రుణం ఇప్పించి లక్ష ఉద్యోగాలు పోకుండా కాపాడారన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ లీడర్లు భూ కబ్జాలు, దందాలు, దాడులకు పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. మనాలీ ఠాకూర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు చుక్కల శ్రీనివాస్, ఎండి ముస్తాఫా, రాము, శోభ, రాణి, తదితరులు పాల్గొన్నారు.