- రామగుండం, యైటింక్లయిన్ కాలనీల్లో పార్టీ నేతల ప్రచారం
గోదావరిఖని/జ్యోతినగర్/ యైటింక్లయిన్ కాలనీ, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం రామగుండం, యైటింక్లయిన్ కాలనీల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం చేశారు. రామగుండం పట్టణంలోని ముస్లిం కుటుంబాలను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సతీమణి మనాలీ ఠాకూర్ కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అలాగే యైటింక్లయిన్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెమిని గౌడ్, పట్టణ అధ్యక్షుడు హరిహర నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని రిలీజ్ చేశారు. ఆదివారం నుంచి యైటింక్లయిన్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. లీడర్లు వెంకటేశ్, అఖిల్, మారుతి, విజయ్, అనిరుధ్, రవి, గౌతమ్, హరినివాస్ పాల్గొన్నారు.
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో..
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ క్యాండిడేట్ గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఐఎన్టీయూసీ నేషనల్ సీనియర్ సెక్రటరీ, ఎన్టీపీసీ ఎన్బీసీమెంబర్ బాబర్ సలీం పాషా కరపత్రాన్ని ముద్రించి శనివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పని చేసే కార్మికుల హక్కుల అమలుకు కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ భరోసా కల్పిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయించే బాధ్యత ఐఎన్టీయూసీ తీసుకుంటుందని తెలిపారు.
పెద్దపల్లి: వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు బొల్లి స్వామి పిలుపునిచ్చారు. శనివారంపెద్దపల్లి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సేవాదళ్ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు నీలకంఠేశ్వర్రావు, రాష్ట్ర మహిళా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ భవాని త్రివేది, రాష్ట్ర కార్యదర్శి దుర్గా బాయ్, పెద్దపల్లి నియోజకవర్గ ప్రెసిడెంట్ కుమారస్వామి, ధర్మపురి నియోజకవర్గ ప్రెసిడెంట్ చంద్రయ్య, మంచిర్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.