కాకా 95వ జయంతి.. రాజకీయ భీష్ముడు

కాకా 95వ జయంతి.. రాజకీయ భీష్ముడు

బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి,  రాజకీయాల్లో ఓటమి ఎరుగని వీరుడు,  ప్రజల శ్రేయస్సు కోసం.. అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు గడ్డం వెంకటస్వామి. కాకా ఈ పేరు యావత్ భారతదేశంలో, ముఖ్యంగా  తెలంగాణ రాష్ట్రంలో తెలియనివాళ్లు ఉండరు. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే కార్మికుల, కర్షకుల కష్టాలు దగ్గర నుంచి చూసి ఎలాగైనా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని కంకణం కట్టుకున్న యోధుడు.  ఆయనకు 20 ఏండ్లు నిండకముందే ఎన్నో పోరాటాలు చేశాడు.  భవన నిర్మాణ కూలీగా మొదలైన ఆయన జీవితం కార్మిక నాయకుడి నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయస్థాయికి చేరింది.  

నిరుపేదలకు అండగా నిలిచిన మహానేత 
గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడిన పేదలు బతుకు పోరుకు  హైదరాబాద్  వచ్చి మహానగరంలో రిక్షాలు, తోపుడు బండ్లుపై ఆధారపడి ఉపాధి పొందేవారు.  అత్యధికులు కూలీలుగా జీవించడం కనిపించేది.  ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నోరులేని నిరుపేదల నుంచి  భూముల విలువలు పెరగటంతో భూస్వాములు అదిరించి బెదిరించి అందినకాడికి దోచుకునేవారు.  గూండాలు దౌర్జన్యంగా పేదవారి భూములను లాక్కోవాలని చూశారు.  ఈ పరిస్థితులలో కాంగ్రెస్ నాయకుడిగా పేరున్న మహానేత కాకా నిరుపేదలకు బాసటగా నిలిచారు.  నిరుపేదలకు అండగా నిలిచి  కొండంత  ధైర్యాన్నిచ్చి జులుం చేసేవారిపై దాడికి ప్రతిదాడి చేయడంలో ప్రేరణ ఇచ్చారు.  గుడిసెలు ఖాళీ చేయకపోవడంతో  దౌర్జన్యంగా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.  అప్పుడు  ఆ సంఘటన చూసి చలించిన వెంకటస్వామి దేశంలోనే మొదటిసారిగా 1949లో  మొదటి జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు. 

పేదవారి గుడిసెలు వారికే ఇచ్చివేయాలని కాకా హైదరాబాదులో లక్షల మందితో భారీ ర్యాలీ చేశారు. ఈ సంఘటనతో ప్రభుత్వం దిగివచ్చి పేదలున్న జాగాలను వారికే ఇప్పించింది.  తెలంగాణ ఉద్యమనేత, కార్మిక పక్షపాతిసిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తదనంతరం ఐఎన్‌టీయుసీ వైస్ ప్రెసిడెంట్​గా,  రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్మిక నేతగా నిర్మాణ కార్మికులతో కలిసి పోరాటాలు చేయడం, సిద్ధిపేట నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ ఇవ్వాలని పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడి గా పనిచేసిన సమయంలో వెంకటస్వామి తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూడడమే తన స్వప్నమని అనేకమార్లు పేర్కొన్న కాకా.. అనుకున్నట్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూశారు.   

కాకా రాజకీయ ప్రస్థానం
రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి అరవై ఏండ్ల రాజకీయ జీవితంలో ఆయనను ఎన్నో పదవులు వరించాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, 1978-–82 మధ్య రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు, 1967లో  తొలిసారి లోక్​సభకు ఎన్నిక, 1971, 1977, 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలుపు,  కేంద్ర  కేబినెట్లో కార్మిక, పౌర సరఫరాలు, పునరావాసం, చేనేత, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 1961–-64  మధ్య  ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1982–-84 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా  ఉన్నారు.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్​సభ డిప్యూటీ లీడర్​గా వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా విస్తృత సేవలందించారు.    2002–-2004  ఏఐసీసీ ( ఎస్సీ, ఎస్టీ) అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తీగల అశోక్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సంక్షేమ సంఘం