గడ్డం వెంకటస్వామి .. గరీబోళ్ల లీడర్

గడ్డం వెంకటస్వామి ..  గరీబోళ్ల లీడర్

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గడ్డం వెంకటస్వామి హైదరాబాద్​లో పేదోళ్ల ఇంటి వెలుగయ్యారు. పేదలు, కార్మికుల సంక్షేమం కోసం నిజాయితీతో కష్టపడి పని చేస్తే ఏ బ్యాక్​ గ్రౌండ్​ లేకున్నా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చన్నది కాకాను చూస్తే నిజమనిపిస్తుంది. ట్రేడ్​ యూనియన్​ మూవ్​మెంట్​​ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కాకా వెంకటస్వామి హైదరాబాద్​లో వేలాది కార్మికుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ కార్మికులకు కాసింత నీడనివ్వాలని సర్కారీ స్థలాల్లో వారితో గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధికెక్కారు. అప్పుడు కాకా పేదలు, కార్మికులకు వేయించిన గుడిసెలు ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తులయ్యాయి. అలా వారికి కొండంత అండగా నిలిచారు వెంకటస్వామి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన కాకా.. మలి దశలో తన చిరకాల స్వప్నం సాకారం చేసుకునేందుకు కాంగ్రెస్ ​పార్టీలో అత్యుతన్నతమైన సీడబ్ల్యూసీ సభ్యుడి పదవిని వదులుకొన్నారు. తన ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూసి ఆయన ఈ లోకాన్ని వీడారు.

రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ వెంకటస్వామి కార్మికులు, పేదల పక్షపాతిగా నిలిచారు. లేబర్​ హౌసింగ్​ ప్రోగ్రామ్​కు ఆయనే ఆద్యుడు.. కార్మికులకు మెరుగైన వేతనాలు ఇప్పించడానికి ఎంతో శ్రమించారు. చదువు ప్రాముఖ్యతను ఆయన 50 ఏండ్ల క్రితమే గుర్తించారు. దళిత బిడ్డలకు ఉచితంగా ఉన్నత విద్య అందించడానికి హైదరాబాద్​లో డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ కాలేజీలు స్థాపించి లక్షలాది మందికి విద్యనందించారు. ఈ విద్యాసంస్థల్లో చదివిన వాళ్లు ఇప్పుడు దేశ,విదేశాల్లో వివిధ స్థాయిలో స్థిరపడి కాకా ఆకాంక్షలను నెరవేర్చుతున్నారు. ఉమ్మడి ఏపీలో  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించారు. 1969లోనే  ప్రత్యేక రాష్ట్రం కోసం యువతను సమీకరించి ఉద్యమించారు. విద్యార్థి దశ నుంచే నాకు కాకాతో సాన్నిహిత్యం ఉన్నది. ఆయన కేవలం కార్మికులు, బడుగులు, దళితులకు మాత్రమే నాయకుడు కాదు. దేశంలోనే తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న నాయకుడు.  రాష్ట్రానికి పీసీసీ చీఫ్​ గా, కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సభ్యుడిగా ఆయన సుదీర్ఘ కాలం సేవలందించారు. 


కాకా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన సంస్కరణ ఫలాలను ఇప్పుడు దేశం, కార్మిక లోకం అనుభవిస్తోంది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్​ యూనియన్​ లీడర్​గా పని చేస్తున్న కాలంలోనే కాకా నన్ను అప్పటి సీఎం దామోదర సంజీవయ్య దగ్గరికి తీసుకెళ్లారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలి, బీదలకు ఎలా సేవ చేయాలో ఆయనే నాకు వివరించారు. ఆయనతో సాన్నిహిత్యం నాలో స్ఫూర్తిని నింపింది. ఆయన రాష్ట్రపతి కావాలని నేను కోరుకున్నా. కానీ, అది నెరవేరలేదు. తన జీవితాంతం కార్మికుల హక్కుల సాధన, పేదల సంక్షేమం కోసమే పాటు పడ్డారు. నాగార్జున సాగర్​ డ్యాం నిర్మాణ కార్మికులకు కనీస వేతనాలు ఇవాలని ఉద్యమించారు. కార్మికులందరినీ ఏకం చేసి యూనియన్​ స్థాపించారు. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నిర్మాణ కార్మికుల కోసం ఆయన పరితపించారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో 1949లో నేషనల్​ హట్స్​ యూనియన్​ స్థాపించి ప్రభుత్వ జాగాల్లో పేదలతో గుడిసెలు వేయించారు. 20 ఏండ్లల్లో 80 వేల మంది పేదలకు ఆయన గూడు కల్పించారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్​ షాపుల ద్వారా నిత్యావసరాలు అందించే ఇప్పించే ఆలోచన చేశారు. 

– డాక్టర్​ కె. కేశవరావు, బీఆర్ఎస్​ పార్లమెంటరీ పార్టీ నేత