కాకా కలల్లో డబుల్​ ఇండ్లు కూడా..

హైదరాబాద్ గల్లీల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్విరామంగా ఉద్యమాలు చేస్తూ ‘అలుపెరుగని ఉద్యమ ధీరుడి’గా కాకా వెంకటస్వామి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈరోజు మనం బృహత్తర పథకం అనుకుంటున్న డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి కాకా ఆ నాడే ఆలోచించారు. దశాబ్దాల క్రితమే మొదట గుడిసె, తర్వాత ఇల్లు, ఆ తర్వాత బంగ్లా కట్టుకునేలా పేదలకు కాకా అండగా నిలిచారు. దశాబ్దాల క్రితం ఆయన పట్టాలు ఇప్పించిన ప్రాంతాలు ఇప్పుడు పెద్ద పెద్ద బస్తీలుగా, కాలనీలుగా మారిపోయాయి. ఏ పదవి చేపట్టినా అటు అధిష్టానాన్ని ఒప్పిస్తూ.. ఇటు సొంత సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్​ పేర్కొన్న విధంగా పే బ్యాక్ టు సొసైటీ నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా కాకా నిలిచారు. అంబేద్కర్​ ఆశయాలకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తన చివరి రోజుల్లో 2014 ఏప్రిల్ 14న అంబేద్కర్ 122వ జయంతి సందర్భంగా కరీంనగర్ సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో కాకా మాట్లాడిన మాటలు పీడితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘‘అంబేద్కర్​ రాజ్యాంగం రాసినందు వల్ల ఈరోజు నేను, మీరు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నాం. లేకుంటే అదే గోసి, గొంగడి వేసుకుని తిరిగేవాళ్లం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు అతి కష్టం మీద మెట్రిక్ వరకు చదివి ఆ తర్వాత మానేస్తున్నారు. వారంతా పై చదువులకు పోవాలంటే వితౌట్ డొనేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్​ ఆశయాలకు అనుగుణంగా 1973లో హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలో అంబేద్కర్ పేరు మీదనే కాలేజీ స్థాపించాను. ఈరోజు ఆ కాలేజీలో చదువుకున్న అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది. కార్మికులు రిటైర్మెంట్ తర్వాత బిచ్చం ఎత్తుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి. కార్మికుల రక్తంతో మనం కోట్లు గడిస్తున్నాం. కానీ వాళ్లు బిచ్చం ఎత్తుకుంటారా? కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ స్కీం తెచ్చి ప్రపంచం ఆశ్చర్యపడేలా చేశాం. అనేక దేశాలు ఈ పథకం తెలపాలంటూ ఆహ్వానాలు పంపడంతో ఆయా దేశాలకు వెళ్లి పెన్షన్ పథకం గురించి వివరించాను”అని కాకా తన మనోగతాన్ని వెల్లడించారు. దక్కాల్సిన గౌరవం దక్కలేదు.. నిరుపేదల గుండెల్లో కాకా చిరస్థాయిగా నిలిచిపోయినా.. ప్రభుత్వ పరంగా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం విచారకరం. రాష్ట్రపతి కాగల సత్తా ఉన్నా కాకుండా కొందరు దానిని అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద వెంకటస్వామి విగ్రహ స్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాజకీయ భీష్ముడు మన కాకా. హైదరాబాద్​లో కాకా మెమోరియల్, లైబ్రరీ, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వపరంగా జయంతి, వర్ధంతులు నిర్వహిస్తాం” అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాకా గౌరవార్థం ప్రకటించిన అంశాలను వెంటనే అమల్లోకి తేవాలి. కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్​లో కాకా వెంకటస్వామి విగ్రహం పెట్టేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అదే ఆ మహనీయునికి నిజమైన నివాళి.