భారత దేశం కీర్తి కిరీటం అయన! తెలంగాణ గుండె చప్పుడు అయన! సామాన్యుడి గుండెకాయ అయన! తెలంగాణ కొంగు బంగారం. మన తెలంగాణ ఆత్మ గౌరవం మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హైదరాబాద్‌కి షాన్ దివంగత గడ్డం వెంకటస్వామి! ఇవాళ 'కాకా'జయంతి. దళిత నేతగా 'కాకా' అంచెలంచెలుగా దేశం గర్వించే లోక నాయకుడిగా ఎదిగారు. ఆయన ఎన్నడూ నేల విడిచి సాము చేయలేదు. నేల మీద ఉండి పని చేశారు. హైదరాబాద్‌లో వేలాది మంది పేదలకు 'భూ' పోరాటం చేసి ఇంటి స్థలం ఇప్పించిన ఘనత కాకాదే. అందుకే ఆయనను 'గుడిసెల' వెంకటస్వామిగా కూడా పిలుస్తారు.
తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి, మలి, ఉద్యమంలో కాకా పోరాడారు. కీలక పాత్ర పోషించారు. లాఠీలు, తూటాలను ఎదుర్కొన్నారు. రాజీపడలేదు. తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌తో గొడవకు దిగారు. సీడబ్ల్యూసీ లాంటి సమావేశం నుంచి బయటకు వచ్చారు. నిత్యం పేదోడి కోసం వారి హక్కుల కోసం జ్వలించే మనస్తత్వంతో ఉండి పోరాడే వారు. సామాన్యుడు సైతం 'కాకా'ను ఎవరి వయా లేకుండానే కలిసే అవకాశం ఎక్కడైనా లభించేది. పోలీసులు, నక్సలైట్ల పేరిట అమాయకులను తీసుకెళ్లి కాల్చి చంపిన సందర్భాల్లో తీవ్రంగా, బహిరంగంగా ఖండించేవారు! ఎలాంటి శషబిషలు లేకుండా బాధిత కుటుంబాలను ఇంటికి వెళ్లి పరామర్శించేవారు. ఆయన తర్వాత ఆయన చిన్న కొడుకు, మాజీ ఎంపీ, గడ్డం వివేక్ వెంకటస్వామి తండ్రి అడుగుజాడల్లో నడిచారు.. నడుస్తున్నారు. ఆయన వద్దకు వచ్చే వారికి పార్టీలకు అతీతంగా సహాయం చేసేవారు. అలాంటి మానవ సంబంధాలు ప్రతి ఒక్కరితో మెయింటైన్ చేయడంలో ఆయన కొడుకు వివేక్ కూడా దిట్ట. కాకా పెద్దకొడుకు మాజీ మంత్రి గడ్డం వినోద్ కూడా ఇందులో తక్కువేమి కాదు! తెలంగాణ సాధన ఉద్యమంలో వివేక్ ఎంపీగా అరెస్ట్ కూడా అయ్యారు. స్వంతపార్టీలో ఇతర ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి ఒత్తిడి తెచ్చారు. పలు పోరాట కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వివేక్ ఇంటిలో తెలంగాణ ఉద్యమ నేత, జయశంకర్ సర్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు 'కాకా' తో సమావేశం అయ్యేవారు.
నల్లబంగారు నేల అంటే ఇష్టం
నల్లబంగారు నేల అన్నా.. ఇక్కడి మనుషులు అన్నా 'కాకా'కు ఇష్టం, ప్రేమ ఎక్కువ ఉండేది.101 కార్మికసంఘాలకు 'కాకా' నాయకత్వం వహించారు. బీఐఎఫ్ఆర్ నుంచి సింగరేణిని కాపాడటంలో 'కాకా' కీలకంగా వ్యవహరించారు. యూనియన్ల నేతలతో మాట్లాడేవారు. సింగరేణికి ఆర్థికంగా కేంద్రం నుంచి అప్పు రూ.1100 కోట్ల వరకు ఇప్పించి, వడ్డీ, మొత్తం చెల్లింపు విషయంలో సంస్థకు మారిటోరియం ఇప్పించారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో తాను మంత్రిగా ఉన్న ప్రభుత్వాన్ని కోరిన మొదటి ఎంపీ 'కాకా'.
‘కాకా’ తెరిచిన పుస్తకం
‘కాకా’ ఒక తెరిచిన పుస్తకం లాంటి వారు. ఓపెన్ హార్ట్. ఓపెన్ హ్యాండ్స్ కాకా స్వంతం. ఎన్నో దానాలు, గుప్త దానాలు. తెలంగాణ ఉద్యమం సహా ఎన్నో ఉద్యమాలకు పోరాటాలకు ఆయన చేయూత మరువలేనిది. కాకా ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్రం సీఎం దివంగత వైఎస్సార్‌తో తలపడ్డారు. ప్రాజెక్ట్ శంకుస్థాపన రోజు అక్కడికి వచ్చి వైస్సార్తో సభలోనే తన ఆశయం నెరవేర్చినందుకు వైస్సార్ కు ధన్యవాదాలు చెప్పారు. 'కాకా' లాంటి నేతలు దేశంలో అరుదు!‘కాకా’ నోట ప్రతి మాటను తీసుకుని ప్రముఖ రచయిత పి.చందు ఎంతో అద్భుతంగా రాసిన చరిత్ర ‘మేరా సఫర్’.. తప్పకచదవాలి. పేద, పీడిత, తాడిత ప్రజల నాయకుడు అంటే ఇలా ఉంటాడు! మన 'కాకా' మాదిరి అనక తప్పదు! నాయక్ హోతో అయిసా అప్నే 'కాకా 'వెంకటస్వామి' జీ' జైసా!
- ఎండి.మునీర్, సీనియర్ జర్నలిస్ట్