పోరాటాల కెరటం

ఆరు దశాబ్దాల బహుజన ఆణిముత్యం, పోరాటాల నిప్పు కణిక గడ్డం వెంకటస్వామి. ఆయన జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శం. పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలను చవిచూసి, ఆత్మగౌరపు శిఖరంగా నిలువెత్తు నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకటస్వామి. నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమం, గుడిసెల ఉద్యమం, కార్మిక, కర్షక పోరాటాల చరిత్రలో ఎవరూ చెరపలేని సంతకం కాకాది. 21 ఏండ్ల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో జైలుకెళ్లిన వ్యక్తి ఆయన. తెలంగాణ సాయుధ పోరాటం సహా తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని అనుకుంటున్న ఈరోజుల్లో,‌‌ 6 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసిన నిప్పు కణిక గడ్డం వెంకటస్వామి. ఒక సందర్భంలో విద్యార్థులకు అండగా ముషీరాబాద్ జైలు ముందు జరిగిన సమరంలో బుల్లెటుకు ఎదురు నిలిచి ప్రాణం పణంగా పెట్టి తెలంగాణ కోసం రక్తం చిందించిన నిజమైన ఉద్యమకారుడు ఆయన. 

రాష్ట్ర ఏర్పాటుకు కృషి..
తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా ఎన్నికై జాతీయ స్థాయిలో తెలంగాణ వాణిని వినిపించారు. దళిత సామాజికవర్గంలో పుట్టినా.. ధైర్యంగా ముందుకు వెళ్లారు. ‌‌కాంగ్రెస్ పార్టీలో ఇందిరా, రాజీవ్ గాంధీ లాంటి వారికి అత్యంత సన్నిహితంగా మెలిగి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి కాకా. తెలంగాణ కోసం కాంగ్రెస్ సభల్లో తన గొంతెత్తి తెలంగాణ ఆకాంక్షను ఆయన నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరుల పెత్తనాన్ని ప్రశ్నించి గైర్ ముల్కీ ఉద్యమానికి పురుడు పోశారు. మూడు తరాల తెలంగాణ ఉద్యమ సాక్షి, ఆరు దశాబ్దాల పోరాట కెరటం వెంకటస్వామి. ఆంధ్రా విలీనం తరువాత తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యం చేసిన స్వాప్నికుడు ఆయన. సీట్ల కోసం, నోట్ల కోసం, ఓట్ల కోసం జరుగుతున్న నేటి ఉద్యమాల్లో ‌‌వాటిని ఆయన ఏనాడూ లెక్కచేయలేదు. నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో వెంకటస్వామి సూచనల మేరకు నడిచారనేది వాస్తవం. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నాటి యూపీఏ చైర్​పర్సన్ ​సోనియాకు తెలంగాణ పరిస్థితులను వివరించి తెలంగాణ కల సాకారం చేసేందుకు కృషి చేశారు. 
- పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ మాల మహానాడు