గడ్డం వెంకట స్వామి..కాకా పేరు యావత్ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలియనివాళ్లు ఉండరు. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే కార్మికుల, కర్షకుల కష్టాలు దగ్గర నుంచి చూసి ఎలాగైనా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని కంకణం కట్టుకున్న యోధుడు. ఆయన ప్రస్థానం భవన నిర్మాణ కూలీగా మొదలైంది. ఆయనకు 20 ఏండ్లు నిండకముందే ఎన్నో పోరాటాలు చేశాడు. భవన నిర్మాణ కూలీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మొదలైన ఆయన జీవితం కార్మిక నాయకుడి నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరింది. కేంద్ర మంత్రిగా కార్మికుల పక్షపాతిగా ఆయన ఎన్నో సేవలు చేశాడు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలలో కాకా అని గుర్తింపు పొందిన వెంకటస్వామి కీలకపాత్ర వహించాడు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింట్లోనూ వెంకటస్వామి పాల్గొన్నారు.1969 ఉద్యమ సమయంలో అరెస్ట్ అయిన ఉద్యమకారుల కోసం ముషీరాబాద్ జైలుకు పోయి అక్కడ పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ దెబ్బలు తిన్నాడు. మరణం అంచులదాకా పోయి పోరాటపటిమతో బతికాడు.
హైదరాబాద్లో బతకడానికి వచ్చిన పేదలు ఖాళీజాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. భూముల విలువలు పెరగటంతో భూస్వాములు, గుండాలు దౌర్జన్యంగా పేదవారి భూములను లాక్కోవాలని చూశారు. సర్కారు కూడా గుడిసెలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఖాళీ చేయకపోవడంతో దౌర్జన్యంగా వారిపై లాఠీఛార్జ్ చేశారు. అప్పుడు ఆ సంఘటన చూసి చలించిన వెంకటస్వామి దేశంలోనే మొదటిసారిగా 1949లో మొదటి జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు. పేదవారి గుడిసెలు వారికేఇచ్చివేయాలని కాకా హైదరాబాదులో లక్షల మందితో భారీ ర్యాలీ చేశారు. ఈ సంఘటనతో ప్రభుత్వం దిగివచ్చి పేదలున్న జాగాలను వారికే ఇప్పించింది. ఈ పోరాటంతోనే హైదరాబాద్లో దాదాపు 80 వేల మందికి సొంతగూడు వచ్చింది. కాకా చేసిన బషీర్బాగ్ గుడిసెల పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. వెంకటస్వామి చేసిన ఈ గుడిసెల పోరాటానికి ప్రతీకగా చాలామంది గుడిసెల వెంకటస్వామి అని, కాకా అని ప్రేమగా పిలుచుకునేవారు.
జెనీవాలో భారత ప్రతినిధిగా..
సాగునీరు రైతులందరికీ అందించాలని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించాడు. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతదేశానికి ప్రతినిధిగా పాల్గొన్నాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా సోనియా గాంధీని ప్రత్యేక తెలంగాణ కావాలని ఒప్పించడంలో కాకా చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ చూసేదాకా ప్రాణం వదలను అని ప్రతిజ్ఞ చేసి తెలంగాణ కల సాకారం అయ్యాక స్వర్గస్తులయ్యారు. అంబేద్కర్ ఆలోచనలను జీవితాంతం పాటించిన కాకా ఆయన పేరుతోనే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి మంచి ప్రమాణాలతో కూడిన విద్యను బడుగు, బలహీన వర్గాల పిల్లలందరికీ అందేలా చూశాడు. ఆయన ప్రస్థానం రెండుసార్లు ఎమ్మెల్యేగా ఏడుసార్లు ఎంపీగా ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన జీవిత చరిత్రను ప్రస్తుత పాఠ్యాంశాలలో చేర్చి భావితరాలకు అందించాలి అని నా మనవి. కాకా బాటలోనే ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి ఆయన ఇద్దరు కుమారులు కృషి చేస్తున్నారు. కాకా ఫౌండేషన్ ద్వారా వారు ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు.
కార్మిక పక్షపాతి
కాకా వెంకట స్వామి కార్మికుల సంక్షేమం కోసం సహకార సొసైటీలను ఏర్పాటు చేయించారు. కార్మికులకు కనీస వేతనాలు జీవన భద్రత కోసం పోరాడి విజయం సాధించారు. నష్టాలలో ఉన్న సింగరేణి కంపెనీ, అక్కడ పనిచేసే కార్మికుల జీవితాలు రోడ్డున పడవద్దని ఆలోచించి ఆ కాలంలోనే సింగరేణికి రూ.1100 కోట్ల నిధులు ఇప్పించి సింగరేణినీ ప్రగతి పథం వైపు నడిచేలా చూశాడు. బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించారు. మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో పెన్షన్స్ సౌకర్యం ఆలోచన చేసింది కూడా కాకానే. రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణ కోసం ఆయన ఎంతో కృషి చేశాడు.
- జాజిమొగ్గ గణేశ్ యాదవ్,
ఉస్మానియా యూనివర్సిటీ