- తెలంగాణ మాల మహానాడు డిమాండ్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని తెలంగాణ మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎరుకల శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం గడ్డం వినోద్‌కు ఉందని, ఆయన మంత్రిగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. వారి తండ్రి కాకా వెంకటస్వామి దేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లింగాల అమృత, జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గుర్రం ప్రదీప్ కుమార్, పట్టణ సెక్రెటరీ కంది రవికుమార్, ఉపాధ్యక్షురాలు కొప్పుల రవళి తదితరులు పాల్గొన్నారు.