బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దొరల రాజ్యాన్ని తరిమికొట్టాలని ఆ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో వినోద్ పాల్గొన్నారు. 10,11వ వార్డులకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లో చేరగా వినోద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ లీడర్లు చెప్పే మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దని, ఆ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వొద్దని కోరారు. కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. వినోద్ వెంట కాంగ్రెస్ లీడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గడ్డం వినోద్గెలుపు ఖాయం
బెల్లంపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ గెలుపు ఖాయమని ఆ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య అన్నారు. పట్టణంలోని హనుమాన్ బస్తీ 33వ వార్డులో కాంగ్రెస్ లీడర్ మేకల శ్రీనివాస్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో మల్లయ్య మాట్లాడారు. పట్టణంలో కాంగ్రెస్ కు వస్తున్న స్పందన చూస్తే వినోద్ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, రెండు సార్లు గెలిచిన దుర్గం చిన్నయ్య చేసిందేమీలేదన్నారు.
ఇప్పటికే ప్రజల్లో బీఆర్ఎస్ పై పూర్తి వ్యతిరేకత ఉందని, కావాలనే కొందరు ఆ పార్టీ లీడర్లు గడ్డం వినోద్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు మరింత చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లీడర్లు ఎంఏ నయీం, రొడ్డ శ్యామ్, బండి రాము, గొడుగు రఘు, మందకృష్ణ, లెంకల శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్, దాసరి ప్రతాప్, సమత్ తదితరులు పాల్గొన్నారు.