ఫలితాలు రాగానే నియోజకవర్గ అభివృద్ధికి రోడ్ మ్యాప్ : వినోద్

బెల్లంపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని, పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్ అన్నారు. రాష్ట్రంలో చీకటి రాజ్యం పోయి ఇందిరమ్మ రాజ్యం రాబోతోందన్నారు. గురువారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని చెప్పారు.

ఎన్నికల ఫలితాల అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి రోడ్డు మ్యాప్ ప్రకటిస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమగ్ర అభివృద్ధికి పాటుపడతానని వెల్లడించారు. ఎన్నికల్లో 35 రోజులపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారని.. వారి శ్రమ వృథాగా పోదన్నారు. సమావేశంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కేవీ ప్రతాప్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్ రాము నాయక్, చిప్ప మనోహర్, నాతరి స్వామి పాల్గొన్నారు.