బీఆర్ఎస్​ను తరిమికొట్టండి.. హస్తంకు ఓటెయ్యండి : గడ్డం వినోద్

బీఆర్ఎస్​ను తరిమికొట్టండి.. హస్తంకు ఓటెయ్యండి :  గడ్డం వినోద్
  • ఇందిరమ్మ రాజ్యం వస్తేనే గ్రామాల అభివృద్ధి

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో దొరల పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. శనివారం ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో వినోద్ ప్రసంగించారు. రెండుసార్లు గెలిచిన దుర్గం చిన్నయ్య అసమర్థ విధానాల వల్ల నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, కాసీపేట, తాండూర్, బెల్లంపల్లి, వేమనపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాలకు నేటికీ రోడ్ల సౌకర్యం లేదన్నారు.

పలు గ్రామాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నయ్య, అతని అనుచరులు భూముల కబ్జాలు, రౌడీయిజాలకు పాల్పడుతూ నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యవతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఎమ్మెల్యే.. తన సామాజికవర్గానికి 95 శాతం దళితబంధు ఇప్పించి, ఇతర ఎస్సీ వర్గాలకు అన్యాయం చేశారన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ సెక్రటరీ రేగుంట చంద్రశేఖర్, చాకపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, మాజీ జడ్పీటీసీ రాంచందర్, కన్నాల మాజీ సర్పంచ్ అనిత, కాంగ్రెస్, సీపీఐ పార్టీల లీడర్లు పాల్గొన్నారు. 

కాంగ్రెస్​లో 200 మంది చేరిక..

బెల్లంపల్లి పట్టణంలోని గంగారాంనగర్​లో శనివారం జరిగిన కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ మహేందర్, లీడర్ గొమాస శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్​కు చెందిన 200ల మంది యువకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి గడ్డం వినోద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్​లో చేరుతూ తన విజయానికి బాటలు వేస్తున్నారని వినోద్ అన్నారు.

వినోద్​కు ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య మద్దతు

బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్​కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.మహేశ్వర్ రాజ్, అఖిల భారత షెడ్యూల్ తెగల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ తెలిపారు. ఆ సంఘాల నాయకులు బెల్లంపల్లిలో వినోద్​ను కలిసి మద్దతు ప్రకటించారు. దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి నియోజకవర్గంలో చేస్తున్న ఆగడాలు, అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని, అతడికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మహర్ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మాధవరావు, బీసీ యువజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి గుర్రం రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.

దత్తత పేరుతో  చిన్నయ్య చేసిందేమీ లేదు

బెల్లంపల్లి రూరల్: సీఎం కేసీఆర్​సహా ఎమ్మెల్యేలు గ్రామాలను దత్తత తీసుకుంటామని గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీలేదని గడ్డం వినోద్​ఎద్దేవా చేశారు. తాండూర్​ మండలం కిష్టంపేటను దుర్గం చిన్నయ్య దత్తత తీసుకొని ఏం చేశాడని ప్రశ్నించారు. తాండూర్​ మండల కేంద్రంతోపాటు కిష్టంపేట, రేచిని, గోపాల్​నగర్, రాజీవ్​నగర్, కొత్తపల్లి గ్రామపంచాయతీల్లో ఆయన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

2004-–2009 వరకు మంత్రిగా  ఉన్నప్పుడు జైపూర్​పవర్​ప్లాంట్​ పెట్టేందుకు తాను కృషి చేశానని, ప్రస్తుతం ఈ ప్లాంట్ రాష్ట్రానికే కరెంట్ సరఫరా చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం అదోగతిపాలు చేసిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్నిస్తే.. కేసీఆర్​ కుటుంబ సభ్యులు అమరుల త్యాగాల మీద వేల కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు.  బీఆర్​ఎస్​ పాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా, ఎంపీటీసీ సూరం రవీందర్​రెడ్డి, నాయకులు గట్టు మురళీధర్​రావు, రంజిత్, నేతరి స్వామి,  దామోదర్​రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.