గద్దర్ అవార్డుల కోసం కమిటీ చైర్మన్​గా నర్సింగరావు, వైస్ చైర్మన్​గా దిల్​ రాజు

  • రూల్స్, రెగ్యులేషన్స్, లోగోపై రిపోర్ట్ ఇవ్వనున్న కమిటీ

హైదరాబాద్, వెలుగు: నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 17మందితో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా ప్రముఖ డైరెక్టర్ జి నర్సింగ రావు, వైస్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత వెంకట్రామ్ రెడ్డి (దిల్ రాజు)ని నియమించింది. వీరితో పాటు మరో 15 మందిని అడ్వైజరీ మెంబర్లుగా నియమిస్తూ సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీలో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. గద్దర్ కూతురు వెన్నెల, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ కవి అందే ఎల్లన్న (అందెశ్రీ), డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు, డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి, వెల్దండి వేణు (బలగం డైరెక్టర్), తనికెళ్ల భరణి, నిర్మాత సురేశ్ బాబు, రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్, డైరెక్టర్ అల్లాణి శ్రీధర్, డైరెక్టర్ సానా యాదిరెడ్డి, డైరెక్టర్ హరీష్ శంకర్, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీలు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై అవార్డుల గైడ్ లైన్స్, లోగో, రూల్స్  ఖరారు చేయనుంది.

రాష్ట్రంలో గత పదేండ్లుగా నంది అవార్డులను ఇవ్వడంలేదని సినీ ప్రముఖలు సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకురాగా.. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ నిర్ణయాలను చెప్పాలని సీఎం కోరారు. అయితే, సినీ ఇండస్ట్రీ నుంచి స్పందన లేదని గద్దర్ ప్రథమ వర్ధంతిలో సీఎం వ్యాఖ్యానించడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖలను కోరారు. దీంతో తమ అంగీకారం తెలుపుతూ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.