ఉగాది నుంచి గద్దర్ అవార్డులు: డిప్యూటీ సీఎం భట్టి

ఉగాది నుంచి గద్దర్ అవార్డులు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: సినిమా రంగంలో విశేష ప్రతిభ కనబర్చే వారికి ఇవ్వనున్న గద్దర్ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉగాది నుంచి గద్దర్ ఫిలిం అవార్డులను ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం (మార్చి 2) హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో  తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మంత్రి సీతక్క జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సంగీత నాటక అకాడమీ సభ్యులు సత్కరించారు.  ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వాగ్గేయకారులకు, కళాకారులకు మా ప్రజా  ప్రభుత్వం గౌరవం ఇస్తోందని తెలిపారు. సినీ ఇండస్ట్రీ వారితో పాటు వాగ్గేయకారులు, నాటకాలు వేసే వారికి కూడా అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. గానం అందరికీ వచ్చే కళ కాదని.. దానిని గౌరవంగా భావించాలన్నారు.

Also Read : ఉగాదిలోపు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాం

కళలను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ధ కాలంగా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని.. మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగానే సినీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే.. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నామని తెలిపారు