రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘గద్దర్’ పేరు ప్రజల్లో నానుతూనే ఉంది. అది అవార్డు రూపేణా కావొచ్చు...వివాదాస్పదం కావొచ్చు. దశాబ్దాలుగా కొనసాగుతున్న నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ పేరును పెట్టినప్పుడు కూడా సమాజంలో చర్చ జరిగింది. భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన తరువాత.. ఇప్పుడు గద్దర్‌పై జాతీయస్థాయిలో వివాదాస్పద చర్చ జరుగుతోంది. మరి ఈ వివాదానికి కారకులెవరు? అసలు గద్దర్ ‘పద్మ’ అవార్డుకు అర్హుడేనా? అనే అంశాలపై రాష్ట్ర ప్రజలకు కచ్చితంగా వాస్తవాలు తెలియాలి.
ఈ దేశంలో వివిధ రంగాలకు చెందిన ఉన్నతమైన పౌరులను ఎంపిక చేసి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరిస్తారు. గద్దర్‌కు ‘పద్మ’ అవార్డు ఇవ్వనందుకు బహిరంగంగా నిరసన తెలిపిన మొట్టమొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాన మంత్రికి నిరసన లేఖ రాస్తానని కూడా ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండి సంజయ్ కుమార్‌ని పాత్రికేయులు ఇదే అంశంపై ప్రశ్న అడిగినప్పుడు... ఈ అంశాలన్నీ తెలుసు కనుక ‘గద్దర్‌కు అవార్డు ఎట్లా ఇస్తారు?’ అని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపేటప్పుడు ఆలోచించి పంపాలి. చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు, గోరటి వెంకన్న విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు పద్మ అవార్డులకు అర్హులే. కానీ, గద్దర్‌కు ఎందుకివ్వాలి? తన హింసావాదంతో ఎంతోమంది అమాయకులైన దళిత, బహుజన తెలంగాణ బిడ్డలను, వందలాది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్నాడు’ అని బదులిచ్చారు. నిజమే కదా..నక్సలైట్ల హింసా వాదానికి బీజేపీ పూర్తి వ్యతిరేకం. భారత్ ను 2026 నాటికి నక్సలైట్లరహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటించారు. చిన్నప్పటి నుంచి జాతీయ భావాలు పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ అదే భావనను వ్యక్తీకరించడంలో తప్పేముంది?
ఎన్నికలను బహిష్కరించాలన్నారు
ప్రజాస్వామ్య దేవాలయంగా పేరుగాంచిన పార్లమెంట్ ‘ఒక పందుల దొడ్డి’ అని వందల సభల్లో ఎలుగెత్తి పాడిన గాయకుడు గద్దర్. ‘అసెంబ్లీ ఒక బాతాఖానీ క్లబ్’ అంటూ హేళన చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పునాదులపై నడుస్తున్న భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించడమే తన లక్ష్యమని బహిరంగ ప్రకటనలు చేసిన విప్లవకారుడు. వేలాది మంది అమాయక దళిత, బహుజనుల బిడ్డల చావుకు కారకుడైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ‘పద్మ’ అవార్డు ఇవ్వాలనడం ఎంతవరకు సమంజసమో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
గద్దర్‌పై ‘ఉపా’ సహా కేసులన్నీ పెట్టిందే కాంగ్రెస్
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు సహచర మావోయిస్టులతో కలిసి గద్దర్ అనేక ‘కుట్ర’లు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), రాజద్రోహం అంటే భారత శిక్షాస్మృతి సెక్షన్ 124ఎ కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఎన్ఐఏ అనేకసార్లు విచారణ చేసింది. గద్దర్ చనిపోయేవరకు 35 కేసుల్లో ప్రధాన ముద్దాయి. 2004 అక్టోబర్‌లో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో నక్సలైట్లు (మావోయిస్టు) జరిపిన చర్చల సందర్భంగా మావోయిస్టు ప్రతినిధిగానే గద్దర్ హాజరయ్యారు. ఆ చర్చలు విఫలమయ్యాక రాష్ట్రమంతా అలజడి సృష్టించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని తీవ్రంగా దూషించిన వ్యక్తి గద్దర్.
బీజేపీ కార్యాలయానికి వెళ్లిన గద్దర్
గద్దర్‌పై కేసులన్నీ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. గద్దర్‌పై ఉపా కేసులు పెట్టి విచారణ జరిపిందీ కాంగ్రెస్సే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇయ్యాల గద్దర్ ఎట్లా దగ్గరయ్యారు? ఆయనకు ‘పద్మ’ అవార్డు ఇవ్వాలని ఎందుకు ప్రతిపాదించిందో జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే, జీవిత చరమాంకంలో తనపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ ఆఫీస్ చుట్టూ, కేంద్ర మంత్రుల చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరిగిన వ్యక్తి కూడా గద్దరే. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆయనకు వినతిపత్రం ఇచ్చి ఫొటో దిగిన వ్యక్తి కూడా గద్దరే. తన వద్దకు వచ్చిన వ్యక్తిని పలకరించడం, చనిపోతే సంతాపం తెలపడం భారతీయ సంప్రదాయం. ప్రధాని మోదీ, బండి సంజయ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కూడా అదే పనిచేశారు. అందులో తప్పేముంది?
వివాదాస్పదం వెనుక రహస్యమేంది?
వివాదాస్పదం చేయడం వెనుక ఉన్న రహస్యమేందో కుహనా లౌకికవాదులు చెప్పాలి. జాతీయవాద సిద్ధాం తాలతో పనిచేస్తున్న బహుజన బిడ్డలు మైసయ్య గౌడ్, పూదరి మధుసూదన్ గౌడ్, మేడారం శంకర్ (రజకుడు) వంటి ఎందరినో పీపుల్స్ వార్ నక్సలైట్లు కాల్చి చంపారు. బండి సంజయ్ జాతీయవాద భావాలను అణువణువునా పుణికి పుచ్చుకున్న నాయకుడు. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను ఎంపీ, కేంద్ర మంత్రిని అయ్యానంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షవల్లే సాధ్యమైంది’ అని ఎన్నోసార్లు చెప్పిన వ్యక్తి బండి సంజయ్. సాధారణంగానే గద్దర్ విషయంలో తన జాతీయవాద భావజాలాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఏన్నో ఏళ్లు సేవ చేసిన శాసనసభ మాజీ స్పీకర్ శ్రీపాద రావు, ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్, పంతూనాయక్ వంటివారు ఎందరో నక్సలైట్ల తూటాలకు బలైతే..కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రస్తావించకపోగా హింసావాదానికి మద్దతిచ్చిన గద్దర్ పక్షాన వకాల్తా పుచ్చుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలకు ఏవిధమైన సంకేతాలను పంపుతున్నట్టు?
ఆ తల్లులకు ఏం సమాధానం చెబుతారు?
నక్సలైట్ సిద్ధాంత వ్యాప్తి కోసం గద్దర్ గజ్జెకట్టి రెచ్చగొడుతూ ఆవేశపూరితంగా పాడిన పాటల కారణంగా వేలాదిమంది అమాయక ప్రజలు బలయ్యారు. చనిపోయినవాళ్లలో 90 శాతానికిపైగా దళిత, బహుజన బిడ్డలే.. మరి బిడ్డలను కోల్పోయిన ఆ తల్లుల మానసిక క్షోభకు మూల్యం ఎవరు చెల్లిస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు, హింసతో రక్తపాతం సృష్టించడమే ఎజెండాగా నక్సలైట్లు పనిచేస్తుంటే వారిని అడ్డుకోవాలనే ప్రభుత్వాల ఆదేశాల మేరకు పనిచేస్తున్న వందలాది మంది పోలీసులను, సమాజంలో మంచి పేరున్న ఐపీఎస్ అధికారులను నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించి విధులు నిర్వర్తించినందుకే కదా ఆ పోలీసులు ప్రాణాలు కోల్పోయింది. మరి అట్లాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వాలని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోలీసుల మరణాలన్నీ కరెక్టేనని, వేలాది అమాయకుల చావులు కూడా సమంజసమేనని చెప్పదల్చుకుందా?
అభిమానం వేరు.. ఆదర్శాలు వేరు
తుపాకీని వదిలి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాక గద్దర్ మారినన్ని రాజకీయ పార్టీలు ఇంకెవరూ మారలేదు. దేవే౦దర్ గౌడ్ పెట్టిన నవ తెలంగాణ పార్టీలో చేరారు. ఆ తరువాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అది వదిలేసి కాంగ్రెస్-, తెలుగుదేశం కూటమి వేదికపైనా కనిపించారు. చివర్లో కేఏ పాల్ పెట్టిన ప్రజాశాంతిలో చేరి మునుగోడు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే సొంతంగా ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిండు. ఎన్నికల వ్యవస్థనే బహిష్కరించాలని, దేవుళ్లే లేరని... తరువాత ఓటేశారు. గుడిలోకి పోయి దేవుడికి మొక్కారు. కవిగా, అద్బుతమైన ప్రజా గాయకుడిగా గద్దర్‌ను అందరం అభిమానిస్తాం. కానీ, ఆయన సిద్ధాంతాలు అందరికీ ఆదర్శప్రాయం కావు. ఆదర్శం వేరు, అభిమానం వేరు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, కుహనా లౌకికవాదులు వాస్తవాలను గమనించి ఈ వివాదానికి తెరదించితే అందరికీ మంచిది.
- డాక్టర్ సోలంకి శ్రీనివాస్,
సోషల్ ఎనలిస్ట్