
బషీర్‌బాగ్, వెలుగు : ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కాల్పులు జరిపిందెవరో నిగ్గు తేల్చాలని గద్దర్ ఫౌండేషన్ డిమాండ్చేసింది. 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై కాల్పులు జరిపారని గుర్తు చేసింది. ఈ సందర్భంగా ‘ప్రశ్నించే గొంతులు.. పాలకుల అణచివేత’ అంశంపై హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు సూర్య కిరణ్ తెలిపారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో సూర్యకిరణ్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లం నాయక్, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. గద్దర్ పై 1997లో కాల్పులు జరపగా, అప్పటి ప్రభుత్వాలు ఎవరు కాల్పులు జరిపారో తేల్చలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గద్దర్ పై కాల్పులు జరిపిందెవరో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం సాగించి గద్దర్ ‘ప్రజా యుద్ధనౌక’ అయ్యారని వివరించారు. మలి దశ ఉద్యమాన్ని ఉరకలెత్తించడం గద్దర్‌కే చెల్లిందన్నారు. గద్దర్ తన పాటల ద్వారా ఎంతో మందిలో ఉత్తేజం కలిగించారన్నారు. సదస్సులో గద్దర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.