తడి ఆరని తాత్వికుడు గద్దర్

తడి ఆరని తాత్వికుడు గద్దర్

గద్దర్ అనే శబ్దమే భాస్వరంగా బగ్గుమని డెబ్భై, ఎనభై దశకంలో విప్లవ పూదోటలు పూయించిన  ప్రజా యుద్ధ నౌక ఆయన. నమ్మిన విశ్వాసాల కోసం తన జీవితంలో సింహ భాగాన్ని విప్లవోద్యమనికి ధారపోశాడు. నవ యవ్వన ప్రాయమంత అడవి, మైదాన ప్రాంత ఉద్యమంలో పెనవేసుకొని జనం గోసను తన గొంతుతో గానం చేసాడు. పై చదువుల కోసం పుట్టిన ఊరు తూప్రాన్ వీడి నగరం బాట పట్టాడు. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ లాంటి ఉద్యమ ఉపాధ్యాయుల ప్రభావం గద్దర్ పై పడింది. ప్రముఖ సినీ దర్శకులు బీ.నర్సింగరావుతో పరిచయం గద్దర్ జీవితంలో కీలక ఘట్టం. అప్పటికే అనేక మంది కవులు, కళాకారులతో ఏర్పడ్డ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ లో సభ్యునిగా అనేక దేశభక్తి, అభ్యుదయ గేయాలకు పురుడు పోశాడు. కాలక్రమంలో ఆర్ట్ లావర్స్ అసోసియేషన్ నే జన నాట్య మండలిగా నిర్మాణం అయ్యింది.  గద్దర్ నాటి నిర్బంధ పరిస్థితుల్లో అజ్ఞాతంలోకి వెళ్లాడు.

బ్యాంకులో అప్పటికే ఉద్యోగం, ఉన్నత ఇంజనీరింగ్ చదువు ఉన్నప్పటికీ ప్రజలకోసం ఆయుధాన్ని అందుకొని అడవి బాట పట్టారు. అఖిల భారత విప్లవ సాంస్కృతిక సంఘం బాధ్యతల్లో  పనిచేశారు.  తన అజ్ఞాత జీవితంలో దేశమంతా తిరిగి అనేక భాషల వేలాది వేదికలు పంచుకున్నాడు. తెలుగు సాహిత్యాన్ని  శ్రీశ్రీ  కవిత్వం ఎంతగా ప్రభావితం చేసిందో, అంతకు రెట్టింపు ప్రభావం గద్దర్ పాటది. ఎనభై  నుంచి తొంబయవ దశకం వరకు గద్దర్ పాటలతో తెలంగాణ పల్లెలన్ని మారుమ్రోగేవి. గద్దర్  పాటల క్యాసెట్ లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన పాటల ప్రభావంతో వందలాది మంది యువకులు ఉద్యమాల బాట పట్టారు. అంతటి శక్తి  గద్దర్ పాటది.  అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు ఉన్నప్పటికీ గద్దర్ ది మాత్రం తనదైన శైలినే. 

పాటల్లో ప్రజల సంస్కృతి, విశ్వాసాలు 

ఒగ్గు, సింధు, దాసరి, యక్షగానం, శారద కాండ్ల బాణీలతో పాటలు కైగట్టి పాడటం గద్దర్ ప్రత్యేకత. ప్రజాదరణ పొందిన అమ్మ తెలంగాణ పాటలో  బువ్వ లేని తల్లి బోనం వండింది అని రాశారు. పొడుస్తున్న పొద్దు పాటలో పవిత్ర బంధమా పరమాత్మ నీ రూపమా అంటాడు. గద్దర్ కు ఎంతో పేరు తెచ్చిన పాట వందనాలు, వందనాలమ్మో పాటలో..  కాకులయ్యి వస్తారా మాబిడ్డలు కొడుకులియ్యమని ఒంటి కాలుతో తపం పడుతం.  లాంటి పద ప్రయోగాలను, జనం విశ్వాసాలను పాటలుగా మలిచి వామపక్ష సాహిత్య విమర్శకులను సైతం మెప్పించిన ఖ్యాతి  గద్దర్  సొంతం. తను ఏది వ్రాసిన జనం విశ్వాసాలను సంస్కృతిని  గానంలోకి మలిచాడు కాబట్టే గద్దర్ పాటలో జీవ ధార ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రారంభమైన గొల్ల సుద్దులుతో   గోశి, గొంగడి, ఎర్ర రుమాలు  వేషధారణ గద్దర్ డ్రెస్ కోడ్ గా ఖ్యాతి గాంచింది. సూటు బూటు లో దర్శనం ఇచ్చే గద్దర్ గోశి, గొంగడిలో గూడా తన దైన ఆహార్యాన్ని  ప్రదర్శించేవాడు. 

గద్దర్​పై కాల్పులు, ప్రభుత్వ చర్చలు విఫలం

దివంగత మర్రి చెన్న రెడ్డి నాటి పీపుల్స్ వార్ పార్టీ నిషేధం సడలింపుతో  అజ్ఞాతం వీడి విశాల  జనజీవన స్రవంతిలోకి వచ్చిన గద్దర్, నాటి నిజాం కళాశాల మైదానం లక్షలాది ప్రజల సమక్షంలో గద్దర్ సాంస్కృతిక ప్రదర్శన ఇస్తుంటే రాత్రి 12 గంటలు దాటినా సుదూరం నుంచి వచ్చిన ప్రజలు తమ ఊర్లను మర్చిపోయారు.   తరువాత కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మారడం మళ్ళీ పీపుల్స్ వార్ నిషేధం రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీవ్ర నిర్బంధం తెలంగాణ ప్రాంతంలో బంద్​ చేయబడిన ఆట, పాట కోసం తెలంగాణ పౌర సమాజం తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం భువనగిరిలో సభ అనంతరం గద్దర్ పై కాల్పులు, తెలంగాణ జన సభ ఆవిర్భావం, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటు.. మలి దశ తెలంగాణ ఉద్యమం పల్లె పల్లె చేరడంలో గద్దర్ కృషి మరువలేనిది. నల్ల దండు ముఠాలు, నయిమ్ గ్యాంగులు ఎన్ని బెదిరించినా ఎదురొడ్డిన గుండె గద్దరన్నది. 

టీపీఎఫ్ ఏర్పాటు నేపథ్యం

తెలంగాణ ఉద్యమాన్ని స్వార్ధ ప్రయోజనాల కోసం  వాడుకొంటూ ఫక్తు రాజకీయాలు చేస్తూ తెలంగాణ అంటే ఓట్లు సీట్ల పంచాయితీగా మార్చి, నాటి కాంగ్రెస్ తో అధికారాన్ని పంచుకొని ఢిల్లీ లాబీయింగ్ పేరుతో కాలయాపన చేస్తున్న పరిస్థితిలో గద్దర్ తన గోశి, గొంగడికి మళ్లీ పని చెప్పారు.  అప్పుడే తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. ఆకుల భూమయ్య, సియాసత్ జహీర్ అలీఖాన్, వేదకుమార్, చిక్కుడు ప్రభాకర్, రత్నమాల  లాంటి నిఖార్సయిన తెలంగాణ మేధావులతో తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ అధ్యక్షుడిగా అవిర్బవించింది. గద్దర్ రెక్కల కష్టంతో గతుకులుగా ఉన్న తొవ్వను తెలంగాణ ఉద్యమ రహదారిగా మలిస్తే,  కేసీర్ లాంటి వారు సాఫీగా కారులో  ప్రయాణించి అధికారం చేపట్టారు.  ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన గద్దర్ ను ఎప్పుడు తొలుస్తూనే ఉండేది. తాను నమ్ముకున్న రాజకీయ విశ్వాసాలకు దూరం జరిగిన తరువాత తెలంగాణలో ప్రతిపక్షాల మీటింగ్​లకు వెళ్లి సామాన్య జనంలో  కలిసి పోయేవారు.

అందరి గద్దర్​

జాతీయ పార్టీల నేతలకు  ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చే వాడు. సిద్ధాంతం ముసుగులో మడి కట్టుకొని కూర్చోవడం గద్దర్ కు రాని పని. ఎవరితోనైనా చర్చించే వారు. అది ఆర్​ఎస్సె​స్సా, ఆర్​ఎస్​యూ నా అన్న తేడాలు ఏమి లేవు. అందుకే ఆయనకు ఆ పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు .  నక్సల్స్ చర్చల శాంతి దూతగా పీపుల్స్ వార్, ప్రభుత్వం మధ్య చర్చల ప్రతినిధిగా తన పాత్ర  పోషించాడు. సిద్ధాంత రాద్ధాంతాల మూస నుండి బయట పడి సాంస్కృతిక రంగంలో ముఖ్య పాత్ర పోషించారు. జనం గోడును గోసని మోసుక తిరిగాడు. ప్రజలను రాజకీయ శక్తిగా మరల్చనంత కాలం మౌలికమైన మార్పు రాదని  భావించేవాడు. తన జీవిత చరమాంకంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఆయన గుండె ధైర్యం చెక్కు చెదరలేదు. ఆచరణే గీటురాయి అని నమ్మిన గద్దర్.. తెలంగాణ పీడితుల పక్షాన చివరి వరకు నిలబడ్డ మొండి గోడ ఆయన.

దొమ్మాట వెంకటేశ్

ఫ్రిలాన్స్ జర్నలిస్ట్