ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన పాటలతో ఉద్యమాలకు మంచి ఊపుతెచ్చారు. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఒక ఊపుతీసుకొచ్చారాయన.
- ALSO READ: ఐసీయూలో కూడా పాటలు పాడారు..
మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించాడు. యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను కూడా గద్దరే స్వయంగా పాడి, ఆడారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడిన పాటలు ప్రజల్లో ఇప్పటికీ చైతన్యం కలిగిస్తుంటాయి.
బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు. గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోయిస్ట్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు.
తెలంగాణ కోసం తీవ్రంగా పోరాటం చేసిన గద్దర్... ప్రత్యేక రాష్ర్ట వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. చాలా సార్లు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.