హుస్నాబాద్, వెలుగు: దొరలకు ఎదురెళ్లి ప్రాణ త్యాగం చేసిన అన్నల యాదిలో హుస్నాబాద్‌లో స్తూపం నిర్మించారు. దీని నిర్మాణంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 1972–89 మధ్య అమరులైన 88 మంది స్మారకార్థం 88 అడుగుల స్తూపాన్ని హుస్నాబాద్ అక్కన్నపేట రోడ్డులోని ఏనెపై అప్పటి పీపుల్స్ వార్ నిర్మించింది. 1989 నుంచి ఏడాది పాటు పీపుల్స్‌వార్ ప్రతినిధులు, సానుభూతిపరులు, రైతులు, కూలీలు గ్రామాల్లో తిరుగుతూ విరాళాలు సేకరించారు.
ఆ టైమ్‌లో గద్దర్ ఊరూరా తిరిగి పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులను చేశారు. స్తూపం నిర్మించిన ప్రదేశంలో ఏడాది పాటు విప్లవ కార్యక్రమాలు, ప్రజాకోర్టులు నిర్వహించారు. 1990 అక్టోబర్ 25న స్తూపాన్ని ఆవిష్కరించగా, ఆనాడు గద్దర్ పాటలు వినేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ స్తూపం చైనాలోని తియన్మెన్ స్క్వేర్ తర్వాత ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా గుర్తింపు పొందింది.