తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌలికంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల సాంస్కృతిక అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. కళా ప్రేమికుడిగా ప్రయాణం ప్రారంభించిన గుమ్మడి విఠల్1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర వేశాడు. వర్గపోరాటం చేరుకున్న అన్ని జీవన క్షేత్రాల్లో చూపు సారించి, అక్కడి నుంచి పీడిత కులాల, వర్గాల బాణీలను, కళారూపాలను వెలికి తీశాడు. విప్లవ వాగ్గేయకార సంప్రదాయాన్ని తీర్చిదిద్ది తన వంటి వందలాది మంది పాటల రచయితలు, కళా ప్రదర్శకులు, గాయకులు తయారు కావడానికి ప్రేరణ అయ్యాడు. తెలుగు నేల మీద విప్లవ సాంస్కృతిక కార్యకర్తలకు ప్రత్యేకమైన ఆహార్యాన్ని, అభినయాన్ని, ఆలాపనను అందించాడు. దళిత కులాల డప్పుల శబ్దానికి సరిదోడుగా సాగే తన ఆలాపన తెలుగు ప్రజలను నిద్రలేపి రోమాంచితం చేసింది. గ్రామాల్లోని పీడిత కులాల ప్రజలను, అందునా యువతను, రైతుకూలీలను, విద్యార్థులను, మధ్య తరగతిని ఆయన గానం, అభినయం ఉర్రూతలూగించింది. ప్రజల నుంచి భాషను, వ్యక్తీకరణను, కవిత్వాన్ని, కళా రూపాలను ఎంచుకొని విప్లవ సందేశాన్ని తిరిగి ఆ ప్రజలకే అందించే రాజకీయ సాంస్కృతిక ప్రయోగంలో జననాట్యమండలి సాధించిన అద్భుత విజయాల వెనుక గద్దర్ ఉన్నాడు. భారతీయ భాషల్లోనే ఆయన అరుదైన సాంస్కృతిక యోధుడిగా నిలిచిపోయాడు. విప్లవ రాజకీయాల ప్రచారంలో, విప్లవోద్యమ విస్తరణలో అంతర్భాగమయ్యాడు.
తొలి పాటల పుస్తకం
జననాట్యమండలి ఏర్పడ్డప్పటి నుంచి ఎమర్జెన్సీ వచ్చేంత వరకు ఆ మూడేండ్లపాటు విప్లవోద్యమ నిర్మాణంలో కవిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన పాత్ర పోషించాడు. 1973లోనే ఆయన తొలి పాటల పుస్తకం ‘వీబీ గద్దర్ పాటలు’ విడుదలైంది. ఎమర్జెన్సీ ఎత్తేసినప్పటి నుంచి ప్రజాపంథాలో విప్లవోద్యమ పురోగతిలోని ప్రతి అడుగును ఆయన తన పాటల్లో రాశాడు. గొంతులో పలికించాడు. వేలాది, లక్షలాది జన సందోహం మధ్య ప్రదర్శనలు ఇచ్చాడు. 1985లో అప్పటి ఆంధప్రదేశ్‍లో ఆట, మాట, పాట బంద్ అయిందనే నుడికారం ప్రచారంలోకి రావడానికి ప్రధాన కారణం జననాట్యమండలి ప్రదర్శనలు ఆగిపోవడమే. అలాంటి తీవ్ర నిర్బంధంలో గద్దర్ ప్రవాసానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఆ కాలంలో ఆయన పాట దేశమంతా ప్రతిధ్వనించింది. అనేక రాష్ట్రాల్లో గద్దర్ సభలు జరిగాయి. అనేక భాషల్లోకి ఆయన పాటలు అనువాదం అయ్యాయి. వేర్వేరు రాష్ట్రాల్లో గద్దర్, జననాట్యమండలి ప్రభావంలో విప్లవ సాంస్కృతికోద్యమం ఆరంభమైంది. అనేక విప్లవ సాంస్కృతిక సంస్థలు ఏర్పడ్డాయి. విప్లవ రచయితల సంఘం, జననాట్యమండలి పూనికతో ఈ సంస్థలన్నీ కలిసి1983 అక్టోబర్ నాటికే అఖిల భారత సాంస్కృతిక సమితిగా ఒకే వేదిక మీదికి వచ్చాయి. ఈ మొత్తం కృషిలో గద్దర్ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నది. భారతీయ భాషా సాహిత్యాల్లోకి విప్లవ సాంస్కృతిక పంథాను తీసికెళ్లడంలో ఆయన కృషి ఉన్నది.
ఆయన పాటలు తిరుగుబాటును ప్రబోధిస్తాయి..
1972 నుంచి 2014 దాకా విప్లవోద్యమానికి, దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాలకు, మలి దశ తెలంగాణ పోరాటానికి కవిగా, కళాకారుడిగా, ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషి అజరామరమైనది. అది భారత విప్లవ, ప్రజా సాంస్కృతిక కోద్యమంలో విడదీయలేని భాగం. ఆ తర్వాత విప్లవ రాజకీయాలకు దూరం జరిగానని ఆయనే చెప్పుకున్నప్పటికీ ఆ రోజుల్లో ఆయన రాసిన, పాడిన పాటలు ఎప్పటికీ విప్లవోద్యమానికి దోహదం చేస్తూనే ఉంటాయి. ఆ పాటల్లోని ప్రచండమైన శక్తి ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాల్లో జీవించే ఉంటుంది. గద్దర్ వ్యక్తిగా ఏ రాజకీయ తీరానికి చేరుకున్నా, వాటి మీద ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది. విప్లవం విజయవంతమయ్యే వరకు ఆయన పాటలు తిరుగుబాటును ప్రబోధిస్తూనే ఉంటాయి. వర్గ పోరాటానికి తిరుగులేని కళా వ్యక్తీకరణలుగా నిలిచి ఉంటాయి. విప్లవోద్యమానికి, పీడిత అస్తిత్వాల విముక్తికి ఆయన తొలి దశ అంతా చేసిన కృషిని విరసం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఆయనకు నివాళి ప్రకటిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం
తెలియజేస్తోంది.
-
ప్రజా జీవితంలో సాంస్కృతిక కృషి..
తెలంగాణ ఉద్యమంలో..విప్లవ రాజకీయాలతోపాటు కారంచేడు, చుండూరు మారణకాండలకు వ్యతిరేకంగా సామాజిక, సాంస్కృతిక ఉద్యమంలో కృషి చేశాడు గద్దర్. దళిత విముక్తి కోసం పాటలు రాశాడు. దీనికి కొనసాగింపుగా మలి విడత తెలంగాణ ఉద్యమవ్యాప్తికి కళాకారుడిగా, ఉద్యమకారుడిగా కీలకంగా పని చేశాడు. తెలంగాణ ప్రజాఫ్రంట్ చైర్మన్‍గా ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసికెళ్లాడు. ఏ ప్రజా సమస్య మీద పాట రాసినా, ఉద్యమించినా ఆయన నక్సల్బరీ రాజకీయాల సాంస్క్సతిక ప్రతినిధిగా ప్రభావం వేశాడు. అయితే ఆ మార్గంలో ఆయన చివరి దాకా కొనసాగలేకపోయాడు. 2013 నుంచే తన రాజకీయ వైఖరిలో మార్పు వచ్చిందని స్వయంగా ప్రకటించుకున్నాడు. విస్తారమైన ప్రజా జీవితంలో సాయుధ వర్గ రాజకీయాలను నిరుపమానంగా ప్రచారం చేసిన వ్యక్తి పార్లమెంటరీ రాజకీయ మార్గంలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు కావాల్సింది ఓట్ల విప్లవమని దృఢంగా ప్రచారం చేశాడు. విప్లవాత్మక భౌతిక దృక్పథానికి భిన్నమైన వైఖరులు చేపట్టాడు.
అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
- రివేరా, కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం