ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల యుద్ధం

ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల యుద్ధం
  • ప్రజల్లో చైతన్యం నింపేందుకే కొత్త పార్టీ
  • గద్దర్ ప్రజా పార్టీ ఆవిర్భావ మేధోమధనం సదస్సులో గద్దర్

అల్వాల్, వెలుగు: ఓట్లర్లను చైతన్యం చేసి చిట్టచివరి పేదవారికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని గద్దర్ అన్నారు. ఆదివారం అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో గద్దర్ ప్రజా పార్టీ ఆవిర్భావ మేధోమధనం సదస్సును గద్దర్ అభిమాన సంఘం అధ్యక్షుడు యాదగిరి అధ్యక్షత నిర్వహించారు. గద్దర్ పాల్గొని మాట్లాడుతూ.. రాజకీయం నేడు వ్యాపారంగా మారిపోయిందన్నారు. నిరుపేదలకు న్యాయం చేసేందుకే రాజకీయ పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. గద్దర్  అభిమాన సంఘం అభ్యర్థన మేరకే గద్దర్ ప్రజాపార్టీ పేరును ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్​కు దరఖాస్తు చేశామన్నారు. ప్రధానమైన విద్య, నాణ్యమైన వైద్యం, అర్హులైన అందరికీ ఉపాధి అవకాశాలు, సమస్యలపై సత్వర న్యాయం, ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలకు వెన్నంటే ఉంటామనే ఐదు అంశాలతో ముందుకెళ్తున్నామన్నారు. తానే ప్రజల వద్దకు వెళ్లి తమ ఎజెండాలను వివరిస్తానన్నారు.

పార్టీ నిర్మాణ క్రమంలో భాగంగా ప్రజల సూచనలు, సలహాలు తీసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. గద్దర్ ప్రజా పార్టీకి అధ్యక్షుడిగా గద్దర్​ను ఎన్నుకున్నామని కార్యవర్గం ఈ సందర్భంగా ప్రకటించింది. వైస్ ప్రెసిడెంట్ గా జి.రాజయ్య , జనరల్ సెక్రటరీగా నాగేశ్, జాయింట్ సెక్రటరీగా యాదులయ్య, ట్రెజరర్​గా విమల గద్దర్, ఇతర కమిటీ సభ్యులను ప్రకటించారు.