విప్లవోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో గర్జించిన గద్దర్

  • ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన ప్రజాగాయకుడు   
  • పేదల సంక్షేమం కోసం పరితపించిన పాటగాడు 

కరీంనగర్, వెలుగు: మెదక్‌‌ జిల్లా తూప్రాన్‌‌ లో గుమ్మడి లచ్చుమమ్మ, శేషయ్య దంపతులకు 1948 జనవరి 31న గద్దర్ పుట్టారు. లచ్చుమమ్మ వ్యవసాయ కూలీ. శేషయ్య వలస కూలీగా వెళ్లి, తాపీ పని నేర్చుకుని మేస్త్రీగా మారాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఔరంగాబాద్‌‌లో డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ నెలకొల్పిన మిలింద్‌‌ విద్యాలయ నిర్మాణ పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిపై అంబేద్కర్‌‌ ప్రభావం పడింది. ఆయన ప్రభావంతోనే గద్దర్ ను ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నారు. 


గద్దర్ తూప్రాన్‌‌లో1966లో హెచ్‌‌ఎస్‌‌సీ, సైఫాబాద్‌‌ సైన్స్‌‌ కాలేజీలో 1967లో పీయూసీ చదివారు. ఉస్మానియా ఇంజనీరింగ్‌‌ కాలేజీలో చేరి 1970లో మధ్యలోనే వదిలేశారు. గద్దర్ స్కూల్, కాలేజీ రోజుల్లో గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ బుర్రకథలు చెప్పేవారు. నాటకాలు కూడా వేసేవారు. ఉస్మానియా నుంచి బయటకొచ్చినంక జననాట్య మండలిలో చేరారు. 1975లో విమలతో గద్దర్ కు పెళ్లయింది. అదే ఏడాది ఈస్ట్‌‌ మారేడ్‌‌పల్లి కెనరా బ్యాంక్‌‌ లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. తర్వాత భువనగిరి ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యారు. అప్పటికే విప్లవోద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో బ్యాంక్‌‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన గద్దర్.. విప్లవోద్యమానికి సేనానిగా మారారు. 

 

1997లో గద్దర్ పై హత్యాయత్నం.. 
తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో 1997 మార్చి 9న భువనగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో గద్దర్ తెలంగాణ కోసం గొంతెత్తారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, శరీరంలో కొన్ని బుల్లెట్లు ఉండిపోయాయి. ఈ ఘటనకు పోలీసులే కారణమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒరేయ్ రిక్షా సినిమాలో పాడిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై సెల్లెమ్మా’ పాటకు, జైబోలో తెలంగాణ సినిమాలోని ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాటకు నంది అవార్డులు వచ్చినప్పటికీ గద్దర్ స్వీకరించలేదు. గద్దర్​కు బసవన్న అవార్డు, సుద్దాల హన్మంతు అవార్డు కూడా వచ్చాయి. 

శాంతి చర్చల ప్రతినిధి.. 
20‌‌‌‌04లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. ఆ టైమ్​లో మావోయిస్టు పార్టీ తరఫున విప్లవ కవులు వరవరరావు, కల్యాణరావుతో పాటు గద్దర్ ప్రతినిధిగా వ్యవహరించారు. అదే సమయంలో పీపుల్స్ వార్.. మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన సభలో గద్దర్ ఆడిపాడారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో నిర్వహించిన ఆ పార్టీ అగ్రనేత ఆర్కే సంస్మరణ సభకు కూడా గద్దర్ హాజరయ్యారు. 

పేదలకు ఉచిత విద్య.. 
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీల పిల్లలకు చదువు చెప్పేందుకు గద్దర్ 1991-– 92లో సికింద్రాబాద్‌‌ తిరుమలగిరి ప్రాంతంలోని వెంకటాపూర్‌‌ గ్రామ శివారు భూదేవినగర్‌‌లో డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ విద్యానికేతన్‌‌ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. 

పదేండ్లు  అజ్ఞాత జీవితం
1978లో జగిత్యాల జైత్రయాత్ర గద్దర్ విప్లవోద్యమ జీవితాన్ని మలుపుతిప్పింది.‌‌ ఆ తర్వాత నిజాం పాలనలోని భూస్వాములు, దేశ్ ముఖ్ ల అకృత్యాలపై తీసిన ‘మా భూమి’ సినిమాలో ప్రజా గాయకుడు యాదగిరి పాత్రను గద్దర్ పోషించారు. ‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి’ అనే పాటను పాడి నటించారు. ఆ తర్వాత 1980లో ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీలో ఆయన ఫుల్‌‌టైమర్ గా మారి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. సుమారు పదేండ్లు అజ్ఞాత జీవితం గడిపారు. 


ఈ క్రమంలో కొంతకాలం సూరత్, బీవండి, ముంబై సిటీల్లోని కార్మిక వాడల్లో ఉద్యమాన్ని నడిపారు. పీపుల్స్ వార్ పార్టీపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించినప్పుడు అజ్ఞాత జీవితంలోకి వెళ్లిన గద్దర్.. రహస్యంగానే జననాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య (ఏఐఆర్ఎస్ఎఫ్), అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్ఆర్‌‌సీ) తదితర ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి తన వంతు కృషి చేశారు. 


బూటకపు ఎన్‌‌కౌంటర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన గద్దర్.. అప్పటి సీఎం ఎన్టీఆర్‌‌పై, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబుపైనా అనేక పాటలు రాసి పాడారు. నక్సల్స్ ఎన్ కౌంటర్లలో చనిపోయినప్పుడు.. వారి అంత్యక్రియలపై పోలీస్ నిర్బంధం ప్రయోగించినప్పుడు గద్దర్ ‌‌ముందుండి నడిచారు. కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండను తీవ్రంగా వ్యతిరేకించారు.