గోదావరిఖని, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్‌తో సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉంది. రాడికల్స్, ఆర్‌వైఎల్ లీడర్స్ పెద్ది శంకర్, బయ్యపు దేవేందర్ రెడ్డి ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తా పోస్టాఫీస్ ఏరియాలో 1979లో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు జార్జి ఫెర్నాండేజ్, స్వామి అగ్నివేశ్‌తో పాటు గద్దర్ హాజరయ్యారు. మంథని గాజులపల్లికి చెందిన టీచర్ అల్లం రాజయ్య రాసిన ‘ఎర్ర జెండ ఎర్ర జెండ ఎన్నియల్లో.. ఎర్రర్రనిది ఈ జెండ ఎన్నియల్లో’అనే పాటను మొదటిసారిగా గద్దర్ ఈ మీటింగ్‌లో పాడి, జనంలోకి తీసుకెళ్లారు. నేడు అది ఎర్ర జెండా పార్టీలన్నింటికీ జాతీయ గీతంగా మారింది.
ఆ తర్వాత పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న జన నాట్య మండలి సాంస్కృతిక కళాకారులను తయారు చేసేందుకు గద్దర్ ఆధ్వర్యంలో 1981లో గోదావరిఖనిలోని శ్రీనివాస థియేటర్‌లో మూడ్రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించారు. 1983లో ‘సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)’తొలి ఎన్నికలకు కూడా ఆయన అటెండ్ అయ్యారు. గోదావరిఖని విఠల్‌నగర్‌లో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య కేసులో పోలీసుల పాత్రపై అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఇందుకు బాధ్యులైన సీఐని సస్పెండ్ చేశారు.
సేవ్ సింగరేణి పేరుతో సభలు, సమావేశాలు
2012 జూన్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘సేవ్ సింగరేణి’పేరుతో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు 15 రోజుల పాటు ప్రతి బొగ్గు గనిపై, సింగరేణి పట్టణంలో సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆయా మీటింగ్‌లలో, బహిరంగ సభల్లో గద్దర్ పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో చాలాసార్లు గద్దర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చి అనేక ప్రోగ్రామ్‌లలో పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కళాకారులైన కొప్పుల రాజనర్సు, దయా నర్సింగ్, గర్జన, మధుప్రియ తదితరులతో గద్దర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. గద్దర్ మృతి సింగరేణి కార్మిక ఉద్యమాలకు తీరని లోటని వివిధ పార్టీలు, సంఘాల లీడర్లు ఎంఎస్ రాజ్‌ఠాకూర్, వి.సీతారామయ్య, రియాజ్ అహ్మద్, ఐ.కృష్ణ, నరేశ్, కె.విశ్వనాథ్, తోకల రమేశ్, ఇండియన్ ఫీపుల్స్ థియేటర్ ప్రతినిధులు కవ్వంపల్లి స్వామి, కన్నం లక్ష్మీనారాయణ, చీకటి అంజయ్య, ఇనుముల రాజమౌళి, ఎజ్జ రాజయ్య, వై.లెనిన్, తదితరులు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.