జూన్ ​14న గద్దర్ సినీ అవార్డుల ప్రదానం : డిప్యూటీ సీఎం భట్టి

 జూన్ ​14న గద్దర్ సినీ అవార్డుల ప్రదానం : డిప్యూటీ సీఎం భట్టి
  • ఫంక్షన్​ను ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: గద్దర్​ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాన్ని జూన్​ 14న నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీసీ వేదిగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ లో గద్దర్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ మీటింగ్ నిర్వహించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ అవార్డ్స్​ జ్యూరీ అవార్డు కమిటీ చైర్ పర్సన్ జయసుధతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గద్దర్​ తెలంగాణ ఫిలిం అవార్డ్స్​ ఫంక్షన్​ను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు రాష్ట్ర సర్కారు తరఫున పూర్తి సహకారం అందిస్తామని  అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ విధంగా నిర్వహిస్తారో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ కార్యక్రమం నిర్వహించాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.  రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మన అదృష్టమని, తెలంగాణ ఉద్యమంలో  ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. 

రాష్ట్ర ఆవిర్భావానికి గద్దర్​ పునాది వేశారని గుర్తు చేశారు.  సింగరేణి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్​తో పాదయాత్ర చేసి.. ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికారని వివరించారు. రాష్ట్రంలో గత పదేండ్లు సినిమా ఇండస్ట్రీ నిరాధరణకు గురైందని, చైన్నై నుంచి హైదరాబాద్ కు ఇండస్ట్రీ రావడం, ఇక్కడ స్టూడియోలకు ల్యాండ్ ఇవ్వడం, పరిశ్రమ ను ప్రోత్సహించడంలాంటి పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని గుర్తు చేశారు.  ఇప్పుడుకూడా సినీరంగానికి చేయూతనివ్వాలని  సీఎంతోపాటు యావత్ కేబినెట్​ నిర్ణయించినట్టు తెలిపారు.  పారదర్శకంగా,  రాగద్వేషాలకు అతీతంగా అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జ్యూరీ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి కోరారు. సినీ అవార్డులతోపాటు సినిమా పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన వ్యక్తుల పేరిట అవార్డులు ఇస్తున్నామని, ఇవి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు. 

వచ్చే నెల చివరి నాటికి ఎంపిక పూర్తి: దిల్​రాజు

2014 నుంచి గత ఏడాది వరకు రిలీజ్ అయిన సినిమాలను మంగళవారం నుంచి జ్యూరీ మెంబర్లు చూసి,  వచ్చే నెల చివరి వరకు అవార్డుల ఎంపిక పూర్తి చేస్తారని ఎఫ్​డీసీ చైర్మన్​ దిల్​ రాజు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. గత 10 ఏండ్లలో రిలీజ్అయిన సినిమాలు చూసి అవార్డులకు ఎంపిక చేయడం పెద్ద టాస్క్ అని జ్యూరీ చైర్​ పర్సన్​ జయసుధ తెలిపారు. పారదర్శకంగా ఎంపిక పూర్తిచేస్తామని చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రంలో  అవార్డులే ఇయ్యలే: మంత్రి వెంకట్​రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చలనచిత్ర అవార్డుల కార్యక్రమం జరగలేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ సర్కారు వచ్చాక  సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవార్డుల ఎంపికకు సినీనటి  జయసుధ  అధ్యక్షతన 15 మందితో కూడిన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.  2014 నుంచి 2023 వరకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు (సంవత్సరానికి ఒక చిత్రానికి) ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు’ ఇస్తామని ప్రకటించారు.