ఉద్యమాల నిర్మాణమే ​జీవితం

ఉద్యమాల నిర్మాణమే ​జీవితం

గద్దర్ ప్రజాకవి. ప్రజా ఉద్యమాలకు మద్దతుగా కలమెత్తి, గళమెత్తిన కవి, కళాకారుడు, వాగ్గేయకారుడు. గద్దర్ ఒక లెజెండ్. తన కాలాన్ని ప్రభావితం చేసిన మహోన్నత కళాకారుడు. 1970 నుంచి నాలుగు దశాబ్దాలుగా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా బలమైన ముద్రవేసి సాంస్కృతిక విప్లవాలను మలుపు తిప్పినవాడు. ఆయన పాట, ఆట, ప్రసంగం మహోత్తుంగ జలపాతం. గద్దర్ ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. ఆయనప్రతి వేదికను ప్రజా రాజకీయాల, భావజాల ప్రచార వేదికగా ఉపయోగించుకోవడానికి కృషి చేశాడు. స్త్రీవాదం, దళిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం బలంగా ముందుకు వచ్చినప్పుడు వాటికి మద్దతుగా నిలిచి వాటికి తన వంతు కృషిని అందిస్తూ కాలంతో పాటుగా ముందుకు సాగుతూ వచ్చాడు. గద్దర్​కు మట్టి బిడ్డలంటే ఎనలేని గౌరవం. జగిత్యాల జైత్ర యాత్ర నిర్మించిన చరిత్ర మరువలేనిది. తెలంగాణ ధూంధాంలో భాగంగా రసమయి బాలకిషన్ బృందంతో పాటు గద్దర్, నేను మరెంతోమంది జగిత్యాలలో ధూంధాం ఊరేగింపు నిర్వహించినప్పుడు జగిత్యాల జైత్రయాత్ర జరిగిన గ్రౌండ్ మట్టిని ముద్దాడి మూటగట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు.

కొత్త తరాన్ని నడిపాడు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గద్దర్ 1995ల నుంచి చురుకుగా పాల్గొంటూ వస్తున్నాడు. భువనగిరి సభలో గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు పూర్తి స్థాయి కృషి అవసరమని నొక్కి చెప్పాడు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన బెల్లి లలిత హత్యకు గురైంది. తెలంగాణ ఉద్యమం కొత్త తరం నుంచి వేలాది మంది కవులను, కళాకారులను సృష్టించింది. వేదికనందించింది. గద్దర్ వారికి స్ఫూర్తినిస్తూ వెంట నడిచారు. ఈ ప్రయత్నంలో ‘తెలంగాణ ధూంధాం’, రసమయి బాలకిషన్, అందెశ్రీ, గూడ అంజయ్య, అంతడుపుల నాగరాజు, గోరటి వెంకన్న, నేర్నాల కిశోర్, సంతోష్, బైరాగి, 
విమలక్క సహకారంతో చరిత్ర సృష్టించింది. గద్దర్ తెలంగాణ ధూంధాంను తనదైన కోణంలో ఉద్యమ కళాకారులకు వేదికగా మలిచి వారిని కూడా 
ఉద్యమంలో భాగస్వాములను చేశాడు.

తెలంగాణపై దార్శనికత

గద్దర్ ఏ విషయంలోనైనా, ఏ ఉద్యమాల్లోనైనా యూనిటీ ఆఫ్  అపోజిట్స్​ను బలంగా పట్టుకుంటారు, విశ్లేషిస్తారు. ఎవ్వరితోనైనా ఐక్య సంఘటన కట్టడంలో, కలిసి పనిచేయడంలో వుండే అవకాశాలను గద్దర్ పసిగట్టినట్టుగా, కలిసి పనిచేసినట్టుగా మరెవరికీ ఈ విద్య, చొరవ సాధ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ సామాజిక వర్గాలకు తక్షణ ప్రయోజనం ఇస్తుందో దీర్ఘకాలిక ప్రయోజనం ఎవరికి అందాలో సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం రాష్ట్ర ఏర్పాటు అయ్యాక ఎలా కృషి చేయాలో గద్దర్ కు ఒక స్పష్టమైన దార్శనికత ఉండింది. 

 ప్రజలే తన ఫ్రంట్​గా..​

తెలంగాణ సాధన కోసం శాంతియాత్రల పేరిట అనేక గ్రామాలు పర్యటించారు గద్దర్. ప్రజాస్వామిక శక్తులతో, కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య నిర్మాణం చేయాలని గద్దర్ బలంగా కాంక్షించారు. గూడ అంజయ్య కన్వీనర్ , పాశం యాదగిరి, నేను గౌరవ సలహాదారులుగా, గద్దర్ గౌరవ అధ్యక్షులుగా రమేష్ హజారీ కోఆర్డినేటర్ గా  ‘తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య’ ను నిర్మించారు.  ఆ తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిర్మాణం అవసరమని ముందుకు వచ్చారు. ఐదు దశాబ్దాలుగా గద్దర్ సమాజానికి, సాహిత్యానికి, ఉద్యమాలకు చరిత్ర పొడువునా అందిస్తున్న చేర్పును, నిర్వహించిన కర్తవ్యాలు, వేసిన ప్రభావం మహోన్నతమైనది. సామాన్య పేద దళిత కుటుంబంలో పుట్టిన గుమ్మడి విఠల్ ఇంజనీరింగ్ విద్యార్థి దశ నుంచి కళాకారుడిగా ఎదుగుతూ గద్దర్ గా  ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రపంచంలో ఏ సాహితీ సాంస్కృతిక సంస్థకు తీసిపోని కృషి జననాట్యమండలి చేసింది. ప్రపంచం గర్వించదగిన కళాకారుడు, పోరాటయోధుడు గద్దర్.

- బీఎస్​ రాములు,
మాజీ చైర్మన్,రాష్ట్ర బీసీ కమిషన్​