- ఒక్కరిని ఓడగొట్టడానికి ఆలీబాబా దొంగలు దిగారు
- మునుగోడులో గౌడ ఆత్మీయ సమ్మేళనం
చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్గడీల రాజ్యం బద్దలు కొట్టి గరిబ్ రాజ్యం తీసుకురావాలంటే బీజేపీతోనే సాధ్యమని, బీసీ నాయకులందరూ అందుకే బీజేపీలో చేరుతున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గురువారం చౌటుప్పల్ లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ గౌడ ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ కోర్ కమిటీ మెంబర్, ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ కులాల వారీగా ఓట్లు పొందేందుకు సభలు, సమ్మేళనాలు పెడుతూ ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. గీత కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకే బూర నర్సయ్య గౌడ్ కేసీఆర్ ను ప్రశ్నించారన్నారు. దీంతో కేసీఆర్ ఆయనను అవమానపరిచి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశాడన్నారు.
పబ్లిసిటీ కోసమే పథకాలు : బూర నర్సయ్య
సీఎం కేసీఆర్ కేవలం పబ్లిసిటీ కోసమే పథకాలు పెడతాడని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈత చెట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి 80% సబ్సిడీ ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈత చెట్లను ఆబ్కారీ శాఖ నుంచి హార్టికల్చర్ శాఖకు మారిస్తే ఉపయోగం ఉండేదని, కానీ, కేసీఆర్అలా చేయకుండా అన్యాయం చేస్తున్నాడన్నారు. గీత కార్మికులకి కార్పొరేషన్ లేకుండా నిర్వీర్యం చేశాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా ఇస్తున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.300 కడితే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చే పాలసీ తీసుకొస్తామన్నారు. బీసీలు అడుక్కునే వాళ్లు కాదని, ఎదిరించే వాళ్లమని..అందుకే టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కేసీఆర్ను ప్రశ్నిస్తున్నామన్నారు.
నెత్తిమీద రూపాయి పెట్టినా కొనరు : కోమటిరెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొంటోందని కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెత్తిమీద రూపాయి పెట్టినా అమ్ముడు పోరని, వారికి రూ.వందల కోట్లు అవసరమా అని విమర్శించారు. మునుగోడులో తనను ఓడగొట్టడానికి ఆలీబాబా దొంగల ముఠా దిగిందన్నారు. ఇది కేవలం మునుగోడు ఎన్నిక కాదని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరాడు.
హైదరాబాద్ ఫలితం రిపీట్ అయితది : వివేక్
రాష్ర్టంలోని మద్యం దుకాణాలతో వచ్చే ఆదాయంతోనే కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం షాపులు తెరిచి గీత కార్మికుల పొట్టలు కొడుతున్నాడన్నారు. గీత కార్మికులకు ప్రభుత్వం కొత్త ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వట్లేదన్నారు. వారికి హెల్త్ కార్డులు, మోపెడ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి పడిన గీత కార్మికులకు ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్స అందించాలన్నారు.