ఎమ్మెల్యే బీర్ల ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నడు : గడ్డమీది రవీందర్ గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తామని కాంగ్రెస్‌‌ నాయకులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. యాదగిరిగుట్టలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించడమే కాదు పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్‌‌‌‌పై ఇష్టంవచ్చినట్లు కామెంట్లు చేయడం సరికాదన్నారు.

కేసీఆర్ పుణ్యానే రేవంత్ రెడ్డికి సీఎం, బీర్ల అయిలయ్యకు ఎమ్మెల్యే పదవి వచ్చిందన్నారు. బీర్ల ఫ్యాక్షన్ తరహా పాలన మొదలుపెట్టారని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను కూల్చుతూ ప్రతీకార చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌‌ పాటించకుండా బీఆర్‌‌‌‌ఎస్ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని మండిపడ్డారు.  మున్సిపల్ వైస్ చైర్మన్ కాటం రాజు, బీఆర్ఎస్ నేతలు పాపట్ల నరహరి,  కళ్లెం స్వాతి సంపత్ గౌడ్,  ముక్కెర్ల అండాలు,  ఆరె యాదగిరి గౌడ్,  సతీష్ యాదవ్ పాల్గొన్నారు.