గద్వాల జిల్లాలో మిస్సింగ్‌‌‌‌.. కర్నాటకలోని ఓ బావిలో డెడ్‌‌‌‌బాడీలు

గద్వాల జిల్లాలో మిస్సింగ్‌‌‌‌.. కర్నాటకలోని ఓ బావిలో డెడ్‌‌‌‌బాడీలు

 

  • కేటీదొడ్డి మండలం కొండాపురంలో మిస్‌‌‌‌ అయిన యువకుడు, బాలుడు
  • కర్నాటకలోని యాపల్‌‌‌‌దిన్నె సమీపంలో మృతదేహాల గుర్తింపు

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లాలో గురువారం కనిపించకుండా పోయిన యువకుడు గోవింద్‌‌‌‌ (21), బాలుడు పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ (6) డెడ్‌‌‌‌బాడీలు కర్ణాటకలోని యాపలదీన్నె సోలార్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో సమీపంలోని ఓ బావిలో శుక్రవారం దొరికాయి. తన అన్న చనిపోవడానికి చిన్నాన్న కుటుంబమే కారణమన్న అనుమానంతో గోవింద్‌‌‌‌ తన చిన్నాన్న కొడుకు పవన్‌‌‌‌ను కిడ్నాప్‌‌‌‌ చేసి, హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వడ్డె మచ్చప్ప, వడ్డె నర్సింహులు అన్నదమ్ములు. మచ్చప్పకు ఇద్దరు కొడుకు రాజు, గోవింద్‌‌‌‌ కాగా రాజు ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. నర్సింహులుకు ఒక కూతురు, కుమారుడు పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ ఉన్నారు. స్థానిక ప్రభుత్వ స్కూల్‌‌‌‌లో రెండో తరగతి చదువుతున్న పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ గురువారం సాయంత్రం స్కూల్‌‌‌‌ నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కేటీదొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ తన పెదనాన్న కొడుకు అయిన గోవింద్‌‌‌‌తో బైక్‌‌‌‌పై వెళ్లినట్లు గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. గోవింద్‌‌‌‌ కూడా కనిపించకుండాపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు మచ్చప్ప కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ ఆధారంగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో గల యాపల్‌‌‌‌దిన్నె పీఎస్‌‌‌‌ పరిధిలోఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి గాలించడంతో సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ సమీపంలో గోవింద్‌‌‌‌ బైక్‌‌‌‌ పార్క్‌‌‌‌ చేసి కనిపించింది. సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ పక్కనే ఉన్న ఓ పాడుబడిన బావి వద్ద చూపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు బావిలో గాలించగా గోవింద్‌‌‌‌, పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీలు దొరికాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.