
గద్వాల, వెలుగు: గద్వాల సర్కారు దవాఖానలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరారు. జిల్లా ఆసుపత్రిలో రూ.2.5 కోట్లతో సమకూర్చిన సిటీ స్కాన్ ను ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సర్కార్ దవాఖానకు వచ్చే రోగులకు క్వాలిటీ వైద్యం అందించేందుకు సిటీ స్కాన్ ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిర ఉన్నారు.
‘పోషణ్ పక్వాడ’ పక్కాగా నిర్వహించాలి
జిల్లాలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 22 వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద పాల్గొన్నారు.
ఈజీఎస్ పనులు క్రమపద్ధతిలో చేపట్టాలి
అలంపూర్: ఈజీఎస్ పనులను క్రమపద్ధతిలో చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో అలంపూర్ నియోజకవర్గ అధికారులకు ఈజీఎస్ పనులపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పూర్తి పని దినాలు కల్పించి గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థిరమైన ఆదాయం అందించి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తామని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తోటలు, రహదారులు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.