- కొలిక్కి రాని డీపీవో ఆఫీస్, మానవపాడు తహసీల్దార్ రికార్డు రూమ్ ఎంక్వైరీ
- కలెక్టరేట్ డిజిటల్ కీ మిస్ యూస్ పైనా చర్యల్లేవ్
- నిందితులకు రాజకీయ అండతో సైలెంట్ అయ్యారనే ఆరోపణలు
గద్వాల, వెలుగు: జిల్లాలో జరిగిన ముఖ్యమైన కేసుల్లో జిల్లా ఆఫీసర్లతో పాటు పోలీస్ ఆఫీసర్లు సప్పుడు చేస్తలేరు. డీపీవో ఆఫీసుకు నిప్పు పెట్టి నెలలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ లోని రికార్డ్ రూమ్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోగా ఆ కేసును అటకెక్కించారు. కలెక్టర్ ఆఫీసులో డిజిటల్ కీ మిస్ యుజ్ తో విలువైన భూములు బదిలీ చేసిన కేసులో కూడా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మూడు కేసుల్లో పెద్ద తలకాయలు ఉండడంతో కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేసుల విచారణ కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది.
డీపీవో ఆఫీస్ కు నిప్పు పెట్టిన కేసు ఎంక్వైరీ స్లోగా జరుగుతోంది. చిన్నపాటి దొంగతనం జరిగితే హడావుడి చేసే పోలీసులు జిల్లా ఆఫీసు తగలబడి మూడు నెలలు (ఫిబ్రవరి 27న నిప్పు పెట్టారు) గడిచినా ఇప్పటివరకు చిన్న క్లూ కూడా పట్టుకోలకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్పందించకుండా, ఆ తరువాత హడావుడి చేసి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుట్ర కోణం దాగి ఉందనే ఆరోపణలున్నా, ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేయడం లేదని అంటున్నారు. ముఖ్యమైన ఫైల్స్ మాయం చేసేందుకు కాలబెట్టారనే ఆరోపణలున్నాయి. 2016లో గట్టు మండలంలోని పంచాయతీల్లో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు వచ్చాయి.
ఆడిట్ ఆఫీసర్లు కూడా అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. 8 మంది జీపీ సెక్రటరీలు అక్రమాలకు పాల్పడినట్లు రిపోర్ట్ ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకునే ఫైల్ డీపీవో ఆఫీస్‌లో ఉండగానే ఈ ప్రమాదం జరగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ ఫైల్ మాయం చేసేందుకే నిందితులు డీపీవో చాంబర్‌ను టార్గెట్ చేస్తూ తగలబెట్టారనే వాదన ఉంది. ఇటిక్యాల మండలంలో ఓ కార్యదర్శి ఇల్లీగల్ గా ఇచ్చిన పర్మిషన్ వ్యవహారంలో సస్పెన్షన్ కు గురయ్యాడు. రీ ఎంట్రీ కోసం ఆ సెక్రటరీ పైరవీ చేసుకుంటున్నాడు. పాత ఫైల్‌తో ఫ్యూచర్ లో ఇబ్బందులు రావద్దని ఆ ఫైల్ ని మాయం చేసేందుకు ఇలా చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఫైల్స్ మాయం చేసేందుకు నిప్పు పెట్టారని అంటున్నారు.
మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ లోని రికార్డు రూమ్ షార్ట్‌సర్క్యూట్ తో దగ్ధం కాగా, జూనియర్ అసిస్టెంట్, తలారిపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని అంటున్నారు. గత ఏడాది అక్టోబర్ 25న షార్ట్‌సర్క్యూట్ తో ఈ పని చేయించి ముఖ్యమైన రికార్డులను తగలబెట్టారనే ఆరోపణలున్నాయి. ఓ మినిస్టర్ కొనుగోలు చేసిన భూముల రికార్డులు, శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు భూముల రికార్డులు మాయం చేసేందుకే ఈ పని చేశారని ఆరోపణలు రాగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సర్వే నెంబర్868/బిలో స్థలాన్ని 280 ప్లాట్లు చేసి ఓనర్లు అమ్ముకున్నారు. ధరణిలో పాత యజమాని పేరే రావడంతో, పట్టా పాస్‌బుక్ కోసం అప్లై చేసుకున్నాడు. ఆ తరువాత పాత యజమానులు, అక్రమార్కులు కలిసి కలెక్టరేట్ ఆఫీస్ లో డిజిటల్ కీని మిస్ యూజ్ చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్లాట్లు కొన్నవారు ఫిర్యాదు చేయడంతో ఆపరేటర్‌ను తొలగించి చేతులు దులుపుకున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎంక్వైరీ కంప్లీట్ చేయలేదు. టెక్నాలజీ పెరిగినా, సీసీ పుటేజీలు ఉన్నా ఈ 3 కేసుల్లో ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించి శిక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఎంక్వైరీ చేస్తున్నాం..
డీపీవో ఆఫీస్ కు నిప్పు పెట్టిన కేసును ఎంక్వైరీ చేస్తున్నాం. డీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి, త్వరలో కేసును ఛేదిస్తాం. కేసులో ఇన్వాల్మెంట్ ఉన్న వారిపై చర్యలు తీసుకుంటాం.
–రంగస్వామి, డీఎస్పీ, గద్వాల