- ఆరు నెలలుగా షాపులు క్లోజ్
- గద్వాల సొసైటీ రద్దుతో మల్దకల్ లో దందాకు తెరలేపిన మాఫియా
- ఇల్లీగల్ డిపో నుంచి రోజుకు వెయ్యి కేసులు సప్లై
గద్వాల, వెలుగు : కల్లు దందాలో రాజకీయ నాయకుల జోక్యంతో గద్వాల కల్లు సొసైటీ రద్దయింది. ఆరు నెలలుగా దుకాణాలు బంద్ కావడంతో మాఫియా ఇల్లీగల్ దందాకు తెరలేపింది. కల్లు సొసైటీని దక్కించుకొనేందుకు రెండు వర్గాలు పోటీ పడుతుండడంతో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. షాపులపై దాడులు, కల్లు డిపోలను తగలబెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో, వీరిలో ఎవరికీ సొసైటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఉన్న సొసైటీపై కొందరు కోర్టుకు వెళ్లడంతో లైసెన్స్ రద్దయింది.
గద్వాల సొసైటీనే కీలకం..
జిల్లాలో కల్లు దందాకు గద్వాల సొసైటీనే కీలకమని గౌడ సంఘం లీడర్లు చెబుతున్నారు. కల్లు దందాపై ఆధిపత్యం కోసం కొందరు కోర్టుకు వెళ్లి రద్దు చేయించారనే విమర్శలున్నాయి. కోర్టు ద్వారా ఆర్డర్స్ రావడంతో, అప్పటి నుంచి కల్లు షాపులు మూతపడ్డాయి. ఇప్పుడు కొత్తగా సొసైటీ ఏర్పాటు చేసుకొని కల్లు షాపులు తెరవాలని ఒక వర్గం చూస్తోంది. దీనిని అడ్డుకునేందుకు మిగిలిన గౌడ సంఘ లీడర్లు యత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ దందాలో మంచి ఆదాయం ఉండడంతో ఆధిపత్యం కోసం గౌడ సంఘం లీడర్లు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ఆ పార్టీకి చెందిన గౌడ సంఘం లీడర్ ఒకరు కల్లు దందాను నడిపించారు. ఇప్పటికీ ఆయన కనుసన్నల్లో దందా కొనసాగుతోంది. ఆయన ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన గౌడ సంఘం లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇల్లీగల్ దందా..
మల్దకల్ మండల కేంద్రంలో కల్లు డిపో ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాత్రిపూట, తెల్లవారుజామున ఆటోలు, డీసీఎంలు, బొలెరో వెహికల్స్‌లో గద్వాల పట్టణ పరిసరాల్లో కల్లు డంప్ చేసి అమ్ముతున్నారు. ఇలా ప్రతిరోజు వెయ్యి కేసులకు పైగా సప్లై చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి గద్వాల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు కల్లు ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఒక సొసైటీ కల్లు ఆ సొసైటీ పరిధిలోనే అమ్ముకోవాలి. అలాగే కల్లు ట్రాన్స్ పోర్ట్ చేయవద్దనే నిబంధన ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా అక్రమంగా కల్లును తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కల్లు మాఫియాకు ఆఫీసర్లు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మల్దకల్ కల్లు డిపోపై కంప్లైంట్ రావడంతో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు తనిఖీకి వెళ్లారు. అయితే వారిని ఇక్కడి ఎక్సైజ్ ఆఫీసర్లు తప్పుదోవ పట్టించారనే విమర్శలు వచ్చాయి. డిపోలో తనిఖీలు చేస్తుండగా, అది కల్లు షాప్ అని చెప్పి కేసు కాకుండా చూశారనే ఆరోపణలున్నాయి.
కల్తీ కల్లు అమ్ముతున్నా..
జిల్లాలో ఎక్కడా ఈత, తాటి చెట్లు లేవు. అలాంటిది ప్రతి రోజు వేల కల్లు పెట్టెలు ఎలా తయారవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మందు కలిపిన కల్లును అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో కల్లు షాపులపై దాడులు చేసి మందు కల్లును ధ్వంసం చేసేవారు. ఈ దందాలోకి పొలిటికల్ లీడర్లు ఎంట్రీ కావడంతో ఇప్పుడు దాడులు చేయడం లేదని అంటున్నారు.
కల్లు రాకుండా చూస్తాం..
గద్వాల పట్టణంలోకి ఇతర ప్రాంతాల నుంచి కల్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశాం. సొసైటీ ఏర్పాటు చేసుకున్న వారు కల్లు వ్యాపారం చేసుకోవచ్చు.
గణపతి రెడ్డి, ఎక్సైజ్ సీఐ