గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 1300 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. గద్వాల టౌన్ పరిధిలో దౌదర్పల్లి దర్గా దగ్గర 585 ఇండ్లు కంప్లీట్ చేశారు. 715 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం డ్రా తీసి మూడు నెలలు అయినా అర్హులకు ఇంకా ఇండ్లు ఇవ్వలేదు. ఇండ్లు కట్టడానికి లేట్ చేసిన సర్కార్ తీరా పూర్తయ్యాక.. కట్టినా వాటిని అర్హులకు కేటాయించడానికి కూడా లేట్ చేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. తొమ్మిదేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు.
ఇంకా కొనసాగుతున్న పనులు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. గద్వాల టౌన్ పరిధిలోని దౌదర్పల్లి దర్గా దగ్గర 771 ఇండ్లను నిర్మించారు. వాటిని గద్వాల టౌన్ లోని అర్హులకు కేటాయించేందుకు ఏప్రిల్ నెలలో ఆఫీసర్లు లక్కీ డ్రా తీశారు. కానీ ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికీ ఇల్లు ఇవ్వలేదు. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు, పైప్ లైన్ పనులు, డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసే పనులు పెండింగ్ లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. ఈ పనులు కంప్లీట్ కావడానికి మరో మూడు నెలలు సమయం పట్టే పరిస్థితులు ఉన్నాయి.
లక్కీ డ్రాతో సరి
అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇంకా డ్రా తీయలేదు. కేవలం ఆలంపూర్ నియోజకవర్గంలోని క్యాతూరు దగ్గర 20 ఇండ్లు మాత్రమే కంప్లీట్ చేశారు. వాటిని కూడా ఇంకా ఇప్పటివరకు ఎవరికీ అలాట్ మెంట్ చేయలేదు.అక్కడ ఇంకా ఇండ్ల నిర్మాణం జరగడం లేదు.
25 ఇళ్లపై ఇంకా క్లారిటీ లేదు
గద్వాల మండల పరిధిలోని గోన్పాడు విలేజ్ దగ్గర 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కంప్లీట్ చేశారు. వాటిని ఆరు నెలల క్రితమే డిప్పు ద్వారా కాకుండా గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీనిపై కలెక్టర్ కు కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ డ్రా ద్వారానే జరగాలని వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పటివరకు ఇంకా ఆ 25 ఇండ్లపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం గోన్పాడు దగ్గర కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రారంభానికి ముందే అవి కూలిపోయే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు.
పనులు పూర్తయ్యేందుకు రెండు నెలలు పట్టొచ్చు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర ఇంకా పనులు నడుస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పనులు కంప్లీట్ కావడానికి మరో రెండు నెలలు టైం పట్టే అవకాశం ఉన్నది. పనులు కంప్లీట్ అయ్యాక లబ్ధిదారులకు ఇండ్లు ఆఫీసర్లు ఇస్తారు.
- ఆంజనేయులు పంచాయతీరాజ్ ఈ ఈ