గద్వాల, వెలుగు : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినా గుర్తింపు దక్కలేదని, ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా డీసీసీ మాజీ ప్రెసిడెంట్ పటేల్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన ఆయన గద్వాలలో మాట్లాడారు. ‘25 ఏండ్లుగా పార్టీని నిలబెట్టేందుకు ఎంతో కష్టపడ్డా. అయినా కొత్తగా వచ్చిన వారి దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లిచ్చారు.
దీని గురించి ఎన్నోసార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. చవటలు, దద్దమ్మల వల్ల కాంగ్రెస్ గద్వాల జిల్లాలో భ్రష్టుపట్టిపోయింది. నాతోపాటు రాజీనామా చేస్తున్న ధరూరు, గట్టు, గద్వాల మండల పార్టీ అధ్యక్షులను కాపాడుకుంటా’ అని ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ ఉమాదేవితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తన వెంట నడుస్తున్నారని, వారందరి భవిష్యత్తుకు తనదే భరోసా అని హామీ ఇచ్చారు.
కొద్దిసేపటికే ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ కి వచ్చిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాలని కోరారు. తర్వాత ఎమ్మెల్యేతో కలిసి హైదరాబాద్ వెళ్లి హరీశ్‌రావు సమక్షంలో చేరారు.