గద్వాల పట్టణంలో .. పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభోత్సవాలు

గద్వాల పట్టణంలో .. పనులు పూర్తి కాకుండానే  హడావుడిగా ప్రారంభోత్సవాలు
  • ఎన్నికల ముందు పొలిటికల్​ లీడర్ల షో
  • ఏండ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాని గద్వాల ఇంటిగ్రేటెడ్​ మార్కెట్
  • ఆర్టీసీ బస్టాండ్​లో సౌలతులు కరువు

గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ను ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారు. ఏడాది దాటినా మిగిలిన పనులు పూర్తి చేయకపోవడంతో  అందుబాటులోకి రాలేదు. రూ.6 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ కొత్త బస్టాండ్​లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.   

రూ.13.50 కోట్లతో నిర్మించినా..

ఒకే చోట అన్ని సౌలతులు ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గద్వాలలో రూ.13.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్  మార్కెట్ ను నిర్మించింది. చికెన్, ఫిష్, మటన్, కిరాణం, వెజిటేబుల్  మార్కెట్  తదితర వాటి కోసం షెటర్లను ఏర్పాటు చేశారు. నాన్​వెజ్​ అమ్మకాల కోసం ప్రత్యేకంగా షాపులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్  మరికొన్ని గంటల్లో వస్తుందనగా, ఎమ్మెల్యే హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. ఏడాది దాటినా ఇప్పటి వరకు వినియోగంలోకి రాకపోవడంతో ప్రస్తుతం ఆ బిల్డింగ్  వృథాగా మారింది. మార్కెట్  పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రూ.6 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. మార్కెట్  చుట్టూ కాంపౌండ్  వాల్, సీసీ రోడ్లు, పై భాగంలో బిల్డింగ్​ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ఎస్టిమేషన్లు తయారు చేశారు.

 పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రజలను మోసం చేసేందుకే హడావుడిగా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ ఓపెన్ చేశారనే విమర్శలున్నాయి. బిల్డింగ్  ఓపెన్  చేసినా మంచినీటి సౌకర్యం, రోడ్డు పనులు, కరెంట్​ ట్రాన్స్​ఫార్మర్  ఏర్పాటు వంటి పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఇదిలాఉంటే ఇంటిగ్రేటెడ్  మార్కెట్ ను ఇప్పటివరకు మున్సిపాలిటీకి అప్పగించకపోవడంతో వినియోగంలోకి రాలేదని అంటున్నారు. ఇప్పటికైనా పనులు కంప్లీట్  చేసి మార్కెట్  షాప్ లను వేలం వేసి వ్యాపారస్తులకు అందిస్తే ఆదాయంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.

 నిరుపయోగంగా షాపింగ్  కాంప్లెక్స్..

పట్టణంలో నిర్మించిన కొత్త బస్టాండ్​ కూడా నిర్లక్ష్యానికి గురవుతోంది. షాపింగ్  కాంప్లెక్స్  కట్టినప్పటికీ, షెటర్లను కిరాయికి ఇవ్వడం లేదు. ఏండ్లు గడుస్తున్నా షెటర్స్  తాళాలు మాత్రం తెరవడం లేదు. వాటిని కిరాయికి ఇస్తే ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. పార్కింగ్, మంచినీళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్​ మార్కెట్, కొత్త బస్టాండ్​లో మిగిలిన పనులు పూర్తి చేసి సమస్యను  పరిష్కరించడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

పెండింగ్  పనులకు ఎస్టిమేషన్లు..

ఇంటిగ్రేటెడ్  మార్కెట్ లో ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం రూ.6 కోట్లతో ఇంజనీర్లు ఎస్టిమేషన్లు తయారు చేసి పంపించారు. పెండింగ్​ పనులు కంప్లీట్  చేసి మార్కెట్ ను అందుబాటులోకి తెస్తాం.

పుష్ప, జిల్లా మార్కెటింగ్  ఆఫీసర్