నడిగడ్డలో బీఆర్ఎస్​కు బీటలు .. కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్​రెడ్డి

నడిగడ్డలో బీఆర్ఎస్​కు బీటలు .. కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్​రెడ్డి
  • కాంగ్రెస్​లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్​రెడ్డి
  • అదే బాటలో అలంపూర్​ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ!
  • క్యాడర్​లో అయోమయం

పాలమూరులో గులాబీ పార్టీ ప్రమాదంలో పడింది. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు తాజాగా కారు దిగగా, బీఆర్ఎస్​లో ఇక ఎవరూ మిగిలేలా లేరు. అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సైతం త్వరలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది. మరోవైపు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కాదని అప్పట్లో కాంగ్రెస్​లో చేరిన వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.  

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్​కు బీటలు వారాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు బండ్ల సాకేత్ రెడ్డితో కలిసి శనివారం హైదరాబాద్​లోని సీఎం క్యాంప్ ఆఫీస్​లో కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం ఉదయమే మంత్రాలయానికి చేరుకున్న ఆయన రాఘవేంద్ర స్వామి టెంపుల్​లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ గద్వాలకు వచ్చి నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ ఆలయంలో పూజలు చేసి నేరుగా హైదరాబాద్​కు వెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో పెండింగ్​లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. 

నాలుగైదు రోజుల్లో 14/14 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14  స్థానాల్లో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ లో మాత్రం బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అందులో గద్వాల ఎమ్మెల్యే తాజాగా పార్టీ మారగా, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరూ చేరితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఇక కనుమరుగు అయినట్టే. నాలుగైదు రోజుల్లో వారు కాంగ్రెస్​లో  చేరునున్నట్లు సమాచారం. 

అడ్డుకున్నా ఆగని చేరిక 

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. రెండు రోజులుగా గద్వాల, హైదరాబాద్​లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాలలో సెల్ టవర్ ఎక్కి ఓ కార్యకర్త నిరసన వ్యక్తం చేయడంతో పాటు మరో ముగ్గురు పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ ఆయన చేరిక మాత్రం ఆగలేదు. 

బీఆర్ఎస్​లో ఎవరూ మిగిలేలా లేరు

గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే వెంట అందరూ కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇదివరకు కాంగ్రెస్​లో ఉండి మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితకు టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు కూడా  కాంగ్రెస్​లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఎమ్మెల్యే ఒక్కరే చేరిన త్వరలోనే అందరూ కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు.

ఆ లీడర్ల పరిస్థితి అగమ్య గోచరం

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కాదని అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామంది లీడర్లు అటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత కూడా జడ్పీ చైర్మన్​గా ఉంటూనే కాంగ్రెస్​లోకి వచ్చారు.  బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండ్ల లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల రాజశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి ఇతర కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరి సరిత కోసం పని చేశారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ బీఎస్ కేశవ్​తోపాటు 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో  చేరారు.

ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం వీళ్ల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీని కాకుండా మూడో ప్రత్యర్థిగా కాంగ్రెస్​ను బలోపేతం చేసేందుకు చేరిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చాలావరకు అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తేలిపోనున్నది.