- బీఆర్ఎస్ వర్సెస్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి
- మాజీ సర్పంచ్ పై దాడి చేసిన సమితి కార్యకర్తలు
గద్వాల, వెలుగు: బీఆర్ఎస్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడులతో గద్వాల టౌన్ మంగళవారం అట్టుడికింది. భూ పంచాయితీ విషయంలో ఏర్పడ్డ గొడవ బీఆర్ఎస్ వర్సెస్ నడిగడ్డ పోరాట సమితి నాయకుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మొదట ధరూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ లీడర్, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి పై నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు దాడి చేయగా ప్రతిగా బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు సమితి ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్, స్కార్పియోను ధ్వంసం చేశారు. ఆ తర్వాత సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ ఉండే శ్రీనివాస అపార్ట్ మెంట్కు వెళ్లి ఆయన కారును ధ్వంసం చేశారు. డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, ఐదుగురు ఎస్సైలు పోలీసులతో అక్కడికి చేరుకొని బీఆర్ఎస్, సమితి కార్యకర్తలను చెదరగొట్టారు.
పొలం పంచాయితీయే దాడులకు కారణం
ధరూర్ మండల కేంద్రంలోని బోయ గోవిందు పొలాన్ని మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మూడు నెలల క్రితం కొనుగోలు చేశారు. భూమి కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ధరూర్ లో పంచాయితీ జరిగింది. ఆ పంచాయతీలో సమితి కార్యకర్తలు ఎదురు మాట్లాడడంతో ఇద్దరిపై దాడి జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని మంగళవారం గద్వాల లోని రెడ్ చిల్లి హోటల్ లో భోజనం చేసేందుకు వచ్చిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని దాదాపు 10 నుంచి 15 మంది కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీడర్లు అక్కడికి చేరుకొని సమితి ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ను, బయట ఉన్న స్కార్పియోను ధ్వంసం చేశారు.
అదేవిధంగా సమితి జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన ఇన్నోవా వెహికిల్ ను ధ్వంసం చేశారు. ఆఫీసులోకి చొరబడి దొరికిన వస్తువులను మొత్తం పగులగొట్టారు. దాడులు చేసిన వారిపై తిరిగి దాడులు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశారు. తమపై దాడులు చేసిన వారిని పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లీడర్లు హక్కుల పోరాట సమితి ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తన ఇంటి పై, ఆఫీస్ పై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.